కొన్నేళ్ల కిందట ఫ్యాక్షన్ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామంలో రెండువర్గాల వ్యక్తులు సందెరాళ్లను ఎత్తేందుకు యువతకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసేవారు. తమ వర్గంలోని వ్యక్తులు బలవంతులుగా ఉండేందుకు తర్ఫీదు ఇచ్చేవారు. ఇలా రెండు వర్గాల మధ్య మొదలైన పోటీలు.. రానురానూ గ్రామానికి పేరు తేవడానికి యువత కలిసికట్టుగా పోటీల్లో పాల్గొనేలా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం గ్రామంలో 20 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన 21 మంది పోటీలకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు వర్గపోరుకు పేరుగాంచిన గ్రామం నేడు పాడి పంటలతో విలసిల్లుతూ.. యువత సందెరాళ్ల పోటీల్లో తర్ఫీదు పొందుతున్నారు.
సందెరాళ్ల పోటీల్లో శిక్షణ పొందే యువత ప్రత్యేకంగా బలవర్ధకమైన ఆహారపు అలవాట్లను పాటిస్తారు. మాంసకృత్తులు, పప్పుదినుసులు, రొట్టెలు, పాలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే సమయాల్లో ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి రోజు 2 లీటర్ల పాలు, బాదం, జొన్న, గోధుమ రొట్టెలతో పాటు మినుములు, పెసలు, అలసందలు, అనుములు వంటి దినుసులు నానబెట్టి తింటారు. కొబ్బరి, బెల్లం కలిపి తీసుకుంటారు. నూనెతో కూడిన ఆహారాన్ని తక్కువగా వినియోగిస్తారు.
ఈత ఉపయుక్తం
పోటీల్లో శిక్షణ పొందే యువత రోజూ ఉదయం యోగాసనాలతోపాటు వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు. నదీ జలాల్లో ఎదురు ఈత కొట్టడం.. అనంతరం రాళ్లు ఎత్తడం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. రాళ్లు ఎత్తేవారికి ఆయాసం రాకుండా ఈత ఎంతో ఉపకరిస్తుంది. అందుకే ఈతకు అంత ప్రాధాన్యత ఇస్తారు.
20కిలోల రాయితో మొదలుపెట్టా..
ఇంటిపక్కన ఓ వ్యక్తి 120 కిలోల రాయి ఎత్తడంతో నాకూ వాటిపై శ్రద్ధ పెరిగింది. 8వ తరగతిలో 20 కిలోల రాయితో మొదలు పెట్టాను. ప్రస్తుతం 90 కిలోల వరకు రాయిని ఎత్తగలుగుతున్నా. ఆహార అలవాట్లు మార్చుకుంటే మరింత బరువు ఎత్తే అవకాశం ఉంటుంది. గ్రామంలో ఒక వ్యాయామశాల ఏర్పాటు చేయించి, జిల్లా స్థాయిలో ఈ పోటీలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి.
- చంద్ర
ప్రత్యేక పోటీలతో గుర్తింపు
జాతరలో జరిగే పోటీల్లో పాల్గొంటూ.. 85 కిలోల వరకు బరువు ఎత్తుతున్నా. అధిక బరువులు ఎత్తాలంటే ఆహార నియమాల్లో మార్పు రావాలి. నిత్యం వ్యాయామం చేస్తూ ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం బల ప్రదర్శలను పరిశీలించి ప్రత్యేక పోటీలు ఏర్పాటు చేయిస్తే మరింత గుర్తింపు వస్తుంది.