జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు paddy farmers problems:ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో 100 కేజీలకు 4 నాలుగు కేజీలు తీసేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే నిర్వాహకులు ఎక్కడ తమ వడ్లను కొనుగోలు చేయరేమోననే భయంతో నోరు మెదపడం లేదు. వడ్ల బస్తాను తూకం వేసేటప్పుడు 40 కేజీలు తూకం వేయాల్సి ఉండగా నిర్వాహకులు 41 కేజీల 600 గ్రాములు పెడుతున్నారు. మిల్లుల యజమానులు తరుగు పేరుతో.. లారీలను వెనక్కి పంపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
farmers in jogulamba gadwal: ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 49,416 మంది రైతులు దాదాపు 96,177 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. దీంతో అధికారులు రైతుల నుంచి 1 లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 74 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నాటికి 66 కొనుగోలు కేంద్రాల ద్వారా 88 మంది రైతుల నుంచి 2,839 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.
నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు
paddy procurement: నవంబర్ 17న గద్వాల వ్యవసాయ మార్కెట్లో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దాదాపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 20 రోజులు పూర్తయింది. చాలా కొనుగోలు కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, టెంట్లను ఏర్పాటు చేయలేదు. గద్వాల మండలం అనంతపురం గ్రామంలో దాదాపు 300 మంది రైతులు వరి పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు 88 మంది రైతులకు టోకెన్స్ పంపిణీ చేయగా 6 మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఇక్కడ నవంబర్ 25న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఈనెల 7 నుంచి కొనుగోలు ప్రారంభించారు.
క్వింటాకు నాలుగు కిలోల తరుగు
paddy farmers in gadwal: రైతుల నుంచి క్వింటాకు 4 కిలోల తరుగు తీస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడి నుంచి మిల్లుకు తరలించే క్రమంలో తరుగు వస్తోందని మిల్లర్లు చెప్పడంతో బస్తాకు 1,600 గ్రాముల తరుగు తీస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తేమ శాతం వచ్చినా కూడా తరుగు తీస్తున్నారు. ప్రభుత్వం 17 శాతం ఉంటేనే వడ్లు కొనుగోలు చేయమని ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు. కానీ వరి కొనుగోలు నిర్వాహకులు మాత్రం 15 శాతం వస్తేనే తీసుకుంటున్నారు. ఇప్పటికే తేమపేరుతో దగా పడుతుండగా తరుగు పేరుతో మరింత మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా కల్లం వద్ద రాత్రి, పగలు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నామని వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇప్పటికే వడ్లు పోసినాం. సీరియల్ నంబరు ప్రకారం కొనుగోళ్లు చేస్తున్నారు. క్వింటాకు నాలుగు కేజీలు తరుగు పోతాది సార్. మాకు ఏం మిగలదు సార్. ఎలాగోలా అమ్ముకోవాలనే ఉన్నాం సార్. మాయిశ్చర్ 16 నుంచి 15 వస్తేనే పడుతున్నారు. నేను మూడెకరాలు సాగు చేసిన. ఇంతవరకు కాంటా కాలే. - రాముడు, రైతు, శివపురం
నేను రెండెకరాలు పొలం వేసిన. మాకు గిట్టుబాటు ధర వస్తలేదు. మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. సన్నరకాలు మాత్రం ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి. వేరే రకాలు వేసిన రైతులం ఇబ్బందులు పడుతున్నాం. తరుగు వల్ల ఇక్కడ కొంత నష్టపోతున్నాం. మాకైతే ఇందులో ఎలాంటి ఆదాయం లేదు. రైతులను కేంద్రం, రాష్ట్రం కలిసి మోసం చేస్తున్నాయి. మాయిశ్చర్ మాత్రం గవర్నమెంట్ ఒకటి చెబితే ఇక్కడ ఒకటి జరుగుతోంది. 14 నుంచి 15 తీసుకుంటున్నారు. మిల్లర్లేమో క్వింటాకు 4 కేజీలు తరుగు తీస్తున్నారు. ఎటు చూసినా రైతుకే నష్టం కలుగుతోంది.
- రవికుమార్, రైతు, అనంతపురం
ఇక్కడికి వచ్చి వారం రోజులైంది. సన్న రకాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. మాయిశ్చర్ 14 నుంచి 15 వరకు తీసుకుంటున్నారు. 40 కేజీలకు గానూ 41 కేజీల 600 గ్రాములు తీసుకుంటున్నారు. క్వింటాలుకు నాలుగు కిలోల తరుగు తీస్తున్నారు. మాకైతే ఎలాంటి గిట్టుబాటు ధర లేదు. ఎక్కడి పోయేందుకు మాకు దారిలేదు. ఇక్కడే ఎలాగోలా అమ్ముకోవాలని చూస్తున్నాం. - రంగన్న రైతు అనంతపురం