జోగులాంబ గద్వాల జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారి రొనాల్డ్‌రోస్ సూచించారు. కరోనా నియంత్రణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ శృతి ఓజా, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష, వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు తెచ్చే ఆరోగ్య సమాచారాన్ని వైద్యులు పర్యవేక్షించాలని తెలిపారు. మెడికల్ షాపుల నుంచి ఎవరెవరు దగ్గు మందును తీసుకెళ్లారనేది డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా నివేదిక తీసుకోవాలన్నారు. వారి అనారోగ్య వివరాలు ఆశావర్కర్లు సేకరించిన జాబితాలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నారు. జాబితాలో లేకుంటే మెడికల్ ఆఫీసర్... వారి వద్దకు వెళ్లి పూర్తి ఆరోగ్య సమాచారం సేకరించాలని చెప్పారు. హోం క్వారంటైన్లలో ఉన్న వారు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపించాలని ఆదేశించారు.