జోగులాంబ గద్వాల జిల్లాలోని జమ్మి చెడులో కొలువైన జమ్ములమ్మ దేవతను అత్యంత మహిమాన్వితంగా కొలుస్తారు. 400 ఏళ్ల నాటి మాట, ప్రస్తుతమున్న జమ్ములమ్మ దేవస్థానం ఒకప్పుడు అటవీ ప్రాంతమని ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతుండగా గడ్డపార లోతుగా పోనందున బరువుగా ఒక రాయిని వెతికి తెచ్చి గడ్డపారపై రాయిని పెట్టుకుని పొలం దున్నేవాడు. తర్వాత ఆ రాయితో కూడిన గడ్డపార అక్కడే వదిలి ఇంటికి వెళ్లేవాడు. మరుసటి రోజు వచ్చి చూడగా రాయి లేదు.
మళ్లీ ఆ రాయి తెచ్చి పొలం దున్ని ఇంటికేళ్లేవాడు. రాయి మళ్లీ కనిపించేదికాదు. ఎవరో కావాలని తీస్తున్నారని... వారిని కనిపెట్టాలని ఒక రోజు రాత్రి పొలం దగ్గరే పడుకున్నాడు రైతు. సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో తెల్లటి దుస్తులతో దేవత రూపంలో ఆ రాయి దర్శనమిచ్చింది. అనంతరం యథా స్థానంలోకి వెళ్ళిపోయి మళ్లీ రాయిగా మారింది.
అప్పటి నుంచి అదే ఆనవాయితీ...
అమ్మ వారి రూపాన్ని చూసిన ఆ రైతు...తన జన్మ ధన్యమైందని సంతోషిస్తూ గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులూ.. మరుసటి రోజు రాత్రి అమ్మవారి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి పొలం దున్నేటప్పుడు అమ్మవారిని కొలిచి వ్యవసాయం చేయడం ఆనవాయితీగా మారింది. అప్పటి నుంచి నూతన గృహ ప్రవేశం, వివాహ మహోత్సవం ఏది చేసినా ముందుగా జమ్ములమ్మను దర్శించుకున్న తర్వాతే కార్యాలు జరుపుకుంటారు.