తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2022, 10:53 PM IST

Updated : Feb 22, 2022, 3:56 PM IST

ETV Bharat / state

Tomato Price Drop : పశువులకు మేతవుతున్న రైతుల కష్టం.. కిలో టమాట రూ.2కంటే తక్కువ..!

Tomato Price Drop: టమాటా ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతేడాది నవంబర్​లో భారీగా ధర పలికిన టమాటా.. ఇప్పుడు అమాంతం పడిపోయింది. టమాటా సాగు చేసిన రైతులు... గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు రాకపోవడంతో పంటను పశువులకు వదిలేస్తున్నారు.

Tomato Price Drop
Tomato Price Drop

పశువులకు మేతవుతున్న రైతుల కష్టం.. కిలో టమాట రూ.2కంటే తక్కువ..!

Tomato Price Drop : జోగులాంబ జిల్లాలో బావులు బోర్ల కింద ఉన్న రైతులు విత్తన పత్తి సాగు తర్వాత వేసవిలో టమాట సాగు అధికంగా చేస్తుంటారు. డిసెంబర్ నెలలో సాగు చేసిన పంట ఫిబ్రవరి నెలలో చేతికొస్తుంది. గతేడాది నవంబర్​లో 24 కిలోలు ఉన్న టమాటా బాక్సు ధర రూ.2,300లు రికార్డు ధర పలికింది. అంటే ఒక్క కిలో రూ.110 నుంచి రూ.120 వరకు వచ్చింది. ఈ ధరను చూసి రైతులు పెద్ద సంఖ్యలో టమాట సాగు చేపట్టారు. పంట చేతికొచ్చే సమయంలో టమాట ధర కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కనీసం పెట్టుబడి ఖర్చులు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

పశువులకు మేతవుతున్న టమాటా..

గద్వాల కూరగాయల మార్కెట్​యార్డ్​లో గత వారం రోజులుగా టమాట ధరలు భారీగా పడిపోయాయి. 24 కేజీల బాక్సు ధర రూ.50 నుంచి రూ.60 మాత్రం పలుకుతోంది. కూలీ ఖర్చులు రాకపోవడం వల్ల రైతులు.. పంటను పశవులకు వదిలేస్తున్నారు.

'రెండెకరాల్లో టమాటా పంట వేశాం. మొదట్లో బాక్సు ధర రూ.1,500 వరకు ఉండేది. మా పంట చేతికొచ్చే సమయంలో రూ.600నుంచి రోజు రోజు దిగుకుంటూ వచ్చి ఇప్పుడు రూ.70కి వచ్చేసింది. ఒక ఎకరంలో టమాటా తీయడానికి కూలీల ఖర్చు రూ.1,800 వరకు అవుతుంది. ఒకవేళ పంటను హైదరాబాద్​ పంపిస్తే ఒక క్యాన్​కు ఆటో కిరాయి రూ.60, అక్కడ కమీషన్​ పోతే... మా చేతిఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోంది. మేము పెట్టిన పెట్టుబడి పాయే.. మా శ్రమ పాయే... ఏమీ చేయాలో తెలియక పంటను పశువులకు వదిలేశాం.' -విజయ్, రైతు

'రెండెకరాల్లో టమాటా సాగు చేశాను. సుమారు రూ.80 వేల వరకు పెట్టుబడి అయింది. టమాటా తెంపడానికి రోజు కూలి మనిషికి రూ.250 అవుతుంది. పంటను అమ్మితే రూ.30 వస్తుంది. పంట డబ్బు కనీసం కూలీలకే సరిపోవడం లేదు. ఏమి చేయాలో తెలియక కనీసం పశువులకైనా పనిచేస్తుందని పంటను పశువులకే వదిలేశాను.'-నరసప్ప, రైతు

కూలీ ఖర్చులు కూడా రావడం లేదు..

జిల్లాలో 8వేల ఎకరాల్లో టమాట పంటను సాగు చేశారు. నారు నుంచి మొదలుకొని ఎరువుల వరకు ఎకరాకు రూ.30 వేలు ఖర్చయింది. ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి వారికి కూలీ ఖర్చులు రావడం లేదు. అందువల్ల పంటను కోయకుండానే వదిస్తున్నామంటున్నారు టమాటా రైతులు. పెరిగిన పెట్టుబడులకు అనుకూలంగా టమాటా ధరలు కనీసం 24 కేజీల బాక్స్ రూ.300 నుంచి రూ.400 పలికితే రైతుకు గిట్టుబాటు ఉంటుందని రైతులు చెబుతున్నారు.

'పంటను మార్కెట్​కు తీసుకొస్తుంటే బాక్సు... రూ.30 నుంచి 40 ఇస్తామంటున్నారు. రైతుకు కనీసం గిట్టుబాటు ధర రావడం లేదు. ఒక బాక్సు 120కిలోల వరకు ఉంటుంది. మాములుగా అయితే రూ.300 నుంచి 400 వస్తే.. రైతుకు పెట్టుబడి పైసలైనా వస్తాయి. ఇదేంటని అడుగుతుంటే బయట అమ్ముకోండి అని మార్కెట్​లో చెబుతున్నారు. అధికారులు స్పందించి పంటకు కనీస గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి.' - తిప్పన్న, రైతు

మార్కెట్​లో తగ్గడం లేదు..

సాగు చేసిన రైతుకంట కన్నీరు తెప్పిస్తున్న టమాటా.. దళారులకు సిరులు కురిపిస్తుందనే చెప్పాలి. రైతు వద్ద బాక్సు రూ.30 నుంచి 40 కొనుగోలు చేస్తుంటే.. మార్కెట్​లో ఒక కిలో రూ.15కు తక్కువ కాకుండా అమ్ముతున్నారు. ఆరుగాలం శ్రమించి, అప్పు చేసి పెట్టుబడి పెట్టి, కూలీలను పెట్టుకుని కోయించి.. ఆటోళ్లో మార్కెట్​కు తెచ్చిన పంటను అయిన కాడికి రైతు అమ్ముకుంటుంటే.. మార్కెట్​లో వీలైనంత తక్కువకు కొనుగోలు చేసి.. మార్కెట్​లలో సాధ్యమైనంత అధిక ధరలకు విక్రయిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారుడికి.. రైతుకు మధ్య ఉన్న దోపిడిపై గురిపెట్టి రైతుకు వినియోగదారుడికి మేలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి :Harish Rao On CM KCR : 'కేసీఆర్​ కాలు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది'

Last Updated : Feb 22, 2022, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details