Gattu Lift Irrigation Scheme Works In Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతం గట్టు. జూరాల, నెట్టెంపాడు, భీమా లాంటి ఎత్తిపోతల పథకాలున్నా.. ఈ ప్రాంతానికి ఉపయోగం లేదు. ఎత్తైన ప్రాంతం కావటంతో వర్షాలు కురిస్తేనే పంటలు పండేది. అందుకే ఇక్కడి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటారు. గట్టు ఎత్తిపోతల పథకం పూర్తయితే తమ ప్రాంతానికీ మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. దశాబ్దాలులగా ఎన్నికల హామీగా మిగిలిన గట్టు ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది.
ర్యాలంపాడు జలాశయం నుంచి 2.80 టీఎంసీల నీటిని ఎత్తిపోయటం ద్వారా గట్టు ఎత్తిపోతల పథకానికి నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రూ.580 కోట్లతో ప్రభుత్వం ఈ పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వగా.. రూ.328 కోట్లకు టెండరు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనుల్ని ప్రారంభించింది. 1.32 టీఎంసీల సామర్థ్యంలో జలాశయాన్ని నిర్మించనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలి దశలో రిజర్వాయర్, అప్రోచ్ కెనాల్, పంపుహౌస్, ప్రెజర్ లెంత్ పనులు చేపట్టనున్నారు. మెుదటగా ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 3.2 కిలోమీటర్ల వరకు అప్రోచ్ కెనాల్‌ను నిర్మిస్తారు. రెండో దశలో రూ.70కోట్లతో కాలువ నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఈ పథకం పూర్తయితే ధరూరు, గట్టు, కేడీ దొడ్డి, మల్దకల్ మండలాల్లోని మెట్ట ప్రాంతాలైన 21 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు నింపడం ద్వారా మరో 3 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. 2018 జూన్‌లో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి .. రెండేళ్లలో నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికైనా నిధులు, ధరల పెరుగుదల, ఇతర సాంకేతిక కారణాలో ఎత్తిపోతలను ఆలస్యం చేయొద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.