తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేత కార్మికుల వెతలు.. మారని బతుకులు - gadwal handloom get GI indication

Gadwal handloom workers: గద్వాల చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఐనా ఆ వృత్తిపైనే.. ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదు. భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గుచూపడం లేదు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నా.. కార్మికుల వెతలు మారడంలేదు. పెరిగిన ముడిసరకు ధరలు, చేనేత వస్త్రాలపై GST భారం, మార్కెటింగ్, ప్రచారం లేకపోవడం, చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం కావడం.. ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు అనేకం. నేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న చేయూత, చేనేత మిత్ర, చేనేత బీమా లాంటి పథకాలు వారిని కాస్తో, కూస్తో ఆదుకుంటున్నా.. గద్వాల చేనేత రంగం మనుగడ కొనసాగించాలంటే మరిన్ని చర్యల ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శంకుస్థాపనకే పరిమితమైన గద్వాల చేనేత పార్కు పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు ఆరోగ్యబీమా, ఉచిత విద్యుత్, రాయితీ రుణాల్లాంటి డిమాండ్లు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో గద్వాల చేనేత ఎదుర్కొంటున్న సమస్యలు.. కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం.

చేనేత
చేనేత

By

Published : Mar 27, 2023, 7:48 PM IST

Gadwal handloom workers: గద్వాల చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మాంచి డిమాండ్‌ ఉంది. నైపుణ్యంతో కూడిన నేత విధానంలో నూలు, పట్టు, సీకో, తుస్సార్, కోటకొమ్మజరీలతో రూపొందించిన గద్వాల చీరలు ప్రపంచంలోనే పేరు గాంచాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ డిజైన్లు వస్త్ర ప్రేమికుల్ని ఆకట్టుకుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో ఐతే గద్వాల చీరలు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతాయి. డిజైన్, రంగుల్ని బట్టి ఒక్కో చీర ధర 10వేలు మొదలు లక్ష రూపాయల వరకు పలుకుతాయి.

మారని జీవన స్థితిగతులు..

విదేశాలతో పాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నె, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రముఖ నగరాల్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. తెలంగాణకే తలమానికంగా ఉన్న గద్వాల చీరలు నేసే విధానం, నాణ్యత ఆధారంగా 2008లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్-GI గుర్తింపు లభించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల, అయిజ, ఎక్లాస్‌పూర్, గొర్లఖాన్ దొడ్డి, గట్టు, మాచెర్ల, ఆరగిద్ద, రాజోలి, అలంపూర్, వనపర్తి సహా పలు ప్రాంతాల్లో గద్వాల చీరలను నేస్తారు.

ఈ వృత్తిపై ఆధారపడి 15వేల చేనేత కార్మికులు జీవిస్తున్నారు. ఐనా వారి జీవనస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో పాటు మగ్గాల సంఖ్య తగ్గిపోతోంది. ఇంతకష్టాలు ఎదుర్కొంటున్న ఈ వృత్తిలోకి రావడానికి భావితరం కూడా మొగ్గు చూపడం లేదు. మరోవైపు ఈ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెడుతున్నా.. అవి నేత కార్మికుల జీవిత స్థితిగతులను మార్చడం లేదు.

జీఎస్‌టీ మోత...

కొవిడ్‌కి ముందు కాస్త కోలుకుంటున్న చేనేత రంగాన్ని మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. తర్వాత కూడా మెరుగవుతున్న పరిస్థితిని పెరిగిన ముడిసరకుల ధరలు మరోసారి చేనేత రంగాన్ని దెబ్బతీశాయి. మూడేళ్లలో ముడిసరకు ధరలు 50 నుంచి 100% వరకు పెరిగాయి. వస్త్రాల తయారీ ఖర్చు అధికమైంది.

దీంతోపాటు చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన GST సైతం ధరల్ని అమాంతం పెంచేసింది. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయలేని స్థితికి ధరలు ఎగబాకడంతో గిరాకీ పడిపోయింది. ఉన్న చీరలే అమ్మకాలు జరగక పోవడంతో కొత్తచీరల తయారీకి బ్రేక్ పడింది. ఈ కారణంగా పరోక్షంగా కార్మికులకు ఉపాధి తగ్గింది. నెల రోజులు కష్టపడి చీరలు నేసినా రోజు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

నకిలీ చీరల రాక..

నాణ్యమైన చేనేత చీరల ధరలు ముడిసరకు, GST కారణంగా పెంచక తప్పలేదు. దీంతో మరమగ్గాలపై నేసిన నకిలీ చీరల వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. మరమగ్గాలపై నేసిన చీరలను గద్వాల సహా ఉమ్మడి జిల్లాలో డిమాండ్ ఉన్ననగరాల్లో అమ్ముతున్నారు. అవి అసలువేవో, నకిలీవేవో చేనేత కార్మికులు తప్ప ఎవరూ గుర్తు పట్టలేరు. నాణ్యమైన గద్వాల పట్టుచీర 10వేలకు తక్కువగా దొరకదు. కానీ, అంతకన్నా తక్కువధరకే నకిలీవి వ్యాపారస్తులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

నాణ్యమైన చీరల కంటే నకిలీ చీరల అమ్మకాలే అధికంగా ఉండటంతో వ్యాపారస్తులు అసలు చీరల్ని నేయించడం లేదు. దీంతో కార్మికులు ఉపాధిపై దెబ్బ పడుతోంది. నేతవృత్తినే నమ్ముకున్న కార్మికులు పట్టుచీరలు నేస్తేనే పూటగడిచేది. అలాంటిది.. నకిలీలరాకతో పనిలేకుండా పోయింది. చాలాకాలంగా మాస్టర్ వీవర్లు కార్మికులకు చీరలు నేసేందుకు ముడిసరుకు ఇవ్వడం లేదని, పని దొరకడమే గగనమైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదరణ కోల్పోతున్న చేనేత సంఘాలు...

ఇక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి వారికి ఆదాయం అందించాల్సిన చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. కానీ, 4, 5 సంఘాలు తప్ప మిగిలినవి దాదాపుగా మనుగడలో లేవు. దీంతో సొసైటీలు చేనేత కార్మికులకు పని కల్పించే పరిస్థితి లేదు. ఐదేళ్లుగా సహకార సంఘాలకు అసలు ఎన్నికలే జరగలేదంటే సంఘాల బలోపేతంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చంటున్నారు కార్మికులు.

సొంతగా చేనేత కార్మికులు చీరలు నేసి అమ్మే పరిస్థితి లేదు. అర్హులైన చేనేత కార్మికు లందరికీ రుణాలివ్వాలని బ్యాంకులను కోరినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. గద్వాల చేనేత చీరల తయారీలో ఇంటర్‌లాక్ సిస్టమ్, చిప్ జకాట్ లాంటి కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వాటిని కొనుగోలు చేసే శక్తి కార్మికులకు లేదు. వాటిని ప్రభుత్వం రాయితీపై అందిస్తే ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఇక ఆన్‌లైన్ అమ్మకాల కోసం అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ లాంటి సంస్థలతో ఒప్పందాలు జరిగినా.. అంతగా ఆదరణ పొందలేదు.

అందని పెట్టుబడులు...

గద్వాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మాస్టర్ వీవర్లు ఉమ్మడి పెట్టుబడితో ప్రారంభం కావాల్సిన చేనేత పార్కు శంకుస్థాపనకే పరిమితమైంది. గద్వాల మండలం పూడూరు సమీపంలో సమగ్ర చేనేత పార్కు ఏర్పాటు కోసం 47ఎకరాల స్థలం కేటాయించారు. తొలుత 10ఎకరాల స్థలం లో చేనేత వస్త్రాల తయారీకి అవసరమైన అన్ని విభాగాల భవనాలు, మౌలిక వసతులు, పరికరాలు ఏర్పాటు చేయాలని భావించారు. 14 కోట్ల 98లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్‌కు.. కేంద్ర ప్రభుత్వం వాటాగా 4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.

అంతకన్నా ముందు గద్వాలలోని మాస్టర్ వీవర్స్ స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ - SPVగా ఏర్పడి 4 కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం సుమారు 24 మంది మాస్టర్ వీవర్స్ ముందుకొచ్చారు. కానీ, పార్క్ యాజమాన్య హక్కులు SPVకి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్.. ఆమోదం కోసం ప్రభుత్వం వద్దే పెడింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా చేనేత కళాశాలను కూడా గద్వాలలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ చేనేత పథకాలు...

గద్వాల చేనేత రంగం మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్మికుల్ని కొద్దో గొప్పో ఆదుకుంటున్నాయి. త్రిఫ్ట్ ఫండ్ పథకం.. ద్వారా చేనేత కార్మికుడు నెలవారీగా అర్జించే ఆదాయంలో 8% బ్యాంకు ఖాతాలో జమ చేస్తే.. సర్కారు 16 % డబ్బులు అతడి ఖాతాలో జమ చేస్తుంది. ఇలా మూడేళ్ల తర్వాత దాచుకున్న డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. ఈ డబ్బు కార్మికులకు ఎంతో ఉపయోగపడింది.

చేనేత మిత్ర పథకం కింద నేత కోసం కొనుగోలు చేసిన దారంపై 40% రాయితీ అందుతుంది. ముడిసరకు కొనుగోలుపై 5% మాస్టర్ వీవర్‌కు, 35 % నేత కార్మికుడు, అనుబంధ కార్మికులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. కానీ, ఈ పథకం లబ్ది అందరికీ అందడం లేదు. కారణం.. ముడిసరకు కొనగోళ్లు నేషనల్ హ్యాండ్ లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ గుర్తించిన సంస్థల వద్దే కొనుగోలు చేయాలి. GST బిల్లులు సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. కానీ, వీటిపై నేత కార్మికులకు అవగాహన లేకపోవడంతో, మాస్టర్ వీవర్లకు 5% రాయితీ మాత్రమే అందడంతో ఆదరణకు నోచుకోవడం లేదు. దీనిపై ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు కార్మికులు.

తిరిగి పునరుద్దరించాలి...

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత బీమా పథకం నిరుపేద కార్మికుల కుటుంబాలను కొంతమేర ఆదుకుంటోంది. ఐతే గతంలో అమలైన ఆరోగ్యబీమా పథకాన్ని సైతం తిరిగి ప్రవేశపెట్టాలని నేతన్నలు కోరుతున్నారు. నేతవృత్తిగా ఉన్న వాళ్లకి కీళ్లనొప్పులు, దృష్టి లోపం, పోషకాహార లోపం సహా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి.

గతంలో ఆరోగ్య బీమా పథకంలో అస్పత్రుల్లో చేసిన ఖర్చు తిరిగి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే వృత్తిలోనే కొనసాగుతూ అనారోగ్యం పాలయ్యే వారికి ఆరోగ్య బీమా కావాలని కార్మికులు కోరుతున్నారు. ఇక చేనేత మగ్గాలు నడవాలంటే రోజంతా ఇంట్లో విద్యుత్ దీపాల వెలుగులు తప్పనిసరి. పెరిగిన విద్యుత్ బిల్లుల కారణంగా విద్యుత్ వాడకం చేనేత కార్మికులకు భారంగా మారుతోంది. రైతులు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఇచ్చినట్లుగానే చేనేత కార్మికులకు సైతం నిర్ణీత పరిధిలో ఉచిత విద్యుత్ అందించాలని కార్మికులు కోరుతున్నారు.

ఆపన్నహస్తం అవసరం...

మారుతున్న కాలానికి అనుగుణంగా రంగులు, డిజైన్లు, నేతవిధానాల్లో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా కొత్త డిజైన్లు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్, ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం లాంటి పథకాలు ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కాగా చేనేత వృత్తిని ఆదుకునేందుకు అన్నిరకాలుగా సహకరిస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు.

మొత్తం మీద చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత చాటుకున్న గద్వాల చేనేత రంగం క్రమక్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటుంది. భావితరం ఈ వృత్తిలోకి రాకపోవడం, మగ్గాల సంఖ్య తగ్గడం కార్మికుల కష్టాలకు నిదర్శనగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో చేనేత రంగాన్ని బతికించుకోవాలంటే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వ పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details