Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రంలో తెరాస అరాచకాలు అంతమవ్వాలన్నా.. భాజపా అధికారంలోకి రావాలన్నా ప్రజల మద్దతు కావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సవాలుగానే మిగిలాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అధికార మార్పిడి కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే వచ్చినట్లు ఆయన చెప్పారు. గద్వాల జిల్లాలో ఏడో రోజు కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర మల్దకల్లో ప్రారంభమై.. సద్దలోనిపల్లి మీదుగు అమరవాయికి చేరుకుంది. పాదయాత్రలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. అమరవాయి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.
"నీళ్లు, నిధులు, నియామకాలు సవాలుగానే మిగిలాయి. ఆర్డీఎస్ వద్ద హెడ్‌రెగ్యులేటరీ ఏర్పాటుకు కేంద్రం కృషిచేసింది. హెడ్‌రెగ్యులేటరీ ఏర్పాటుకు 3 రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 299టీఎంసీలు చాలని తెలంగాణ అంగీకరించడం తొందరపాటే. మీ అంగీకారం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. ఆర్డీఎస్ నీటి పంపిణీపై టెలిమెట్రీ ద్వారా వాటాలు తేలుతాయి. ట్రైబ్యునల్ లేకుండా నీటి వాటాలు ఎలా తేలుతాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించారా?. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుంది?. తెలంగాణ ప్రజలు అధికార మార్పిడి కోసం సిద్ధంగా ఉన్నారు." -ప్రహ్లాద్‌సింగ్, కేంద్ర మంత్రి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియమాకాల కోసమని... కానీ పాలమూరు ప్రాంతానికి సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొన్నది కేసీఆర్ అని.. కానీ రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను తెచ్చుకునేందుకు భాజపా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అందులో భాగంగానే 3 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయించామన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తోమర్.. సమావేశ వివరాలు ప్రకటించారని వెల్లడించారు. భేషజాలకు పోకుండా రైతులకోసం పనిచేయాలని హితవు పలికారు.
'పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కానీ అందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటి వరకు కేంద్రానికి సమర్పించలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఓ వైపు డిమాండ్ చేస్తూనే.. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసును విరమించుకుంటే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కేసును విరమించుకున్నారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ప్రయత్నాలు. గోదావరి నుంచి 200 కిలోమీటర్ల దూరం.. లక్షా 20వేల కోట్లు పెట్టి కాళేశ్వరం పూర్తి చేసుకుని కేసీఆర్ ఫాం హౌస్‌కు నీళ్లు తెప్పించుకున్నారు. అదే రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. కమీషన్లు రావని కేటాయించడం లేదు.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు