Bandi Sanjay: తెరాస పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారన్న ఆయన.. ఇప్పుడు రైతుల వెంబడి పడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి ఇస్తానని చెప్పిన ఉప్పుడు బియ్యం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఫిబ్రవరి 25న రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన సమావేశంలో ధాన్యం ఇవ్వమని తెలంగాణ చెప్పిందని బండి సంజయ్ ఆరోపించారు. అలా చెప్పిన వాళ్లే మళ్లీ దిల్లీకి వెళ్లి ధర్నా చేశారన్నారు.
రైతులకు అర్థమైంది.. ధాన్యం కొనేది కేంద్రమేనని ప్రజలకు రైతులకు అర్థమైందని సంజయ్ స్పష్టం చేశారు. రైతుల కోసం దిల్లీలో గంట సేపు కూడా దీక్ష చేయలేకపోయారని ఆయన తెలిపారు. రూ.1960కి తక్కువగా ఎవరు ధాన్యం అమ్ముకున్నారో వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కేసీఆర్ను నమ్మి వరి వేయకుండా నష్టపోయిన రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పి.. ఏప్రిల్ 13న మళ్లీ కేంద్రానికి లేఖ రాశారని బండి సంజయ్ వెల్లడించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని అదే లేఖ ముందే రాయమని భాజపా మొత్తుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి మళ్లీ కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని ఆయన ప్రశ్నించారు.