గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ (corona vaccination)జరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజుల్లో ప్రజల్లో చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉండేవి. స్థానిక ప్రభుత్వాలు, అధికారులు.. ప్రజల్లో అవగాహన కల్పించారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో.. చిన్నగా అస్వస్థత, తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం వస్తాయని.. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదంటూ అవగాహన కల్పించారు. కానీ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కరోనా టీకాపై అనుమానాలు వీడలేదని తాజా ఘటనతో తెలుస్తోంది.
వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యాడంటూ.. టీకా వేసిన ఆశావర్కర్పై (attack on Asha worker) దాడిచేశారు. ఏమీ కాదని చెప్పినా వినకుండా దాడిచేశారని ఆమె పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. శనివారం దాడి జరగ్గా.. ఆదివారం నాడు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం మల్లాపురం గ్రామంలో జరిగింది.
అసలేమైందంటే..
మల్లాపురంలో ఈనెల 9న.. వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రక్రియలో గ్రామంలోని చాలా మంది టీకాలు వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఒకరికి జ్వరం వచ్చింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు.. టీకా వేసిన ఆశావర్కర్ ఇంటికి వెళ్లి దాడిచేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.