జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న గూడెం దొడ్డి జలాశయం తూముల గేట్ల వ్యవస్థలో లోపాలు రైతులకు శాపంగా మారాయి. జలాశయం ద్వారా 99 ప్యాకేజీ కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. కాలుకు సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేశారు. దీంతో శుక్రవారం పలు చోట్ల కాలువ కొతకు గురైంది. కాలువ నీరు పంట పొలాలను ముంచెత్తటంతో రెండు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
ఉల్లి, పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. కాలువకు నీటి సామర్థ్యం తగ్గించటానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తూములకు ఉన్న గేట్ల అయిల్ సీల్స్ లోపం కారణంగా గేట్లు మొరాయించాయి. దీంతో ప్రధాన కాలువ ద్వారా నీటిని నెట్టెంపాడు లిఫ్ట్-1కు చేరవేసే సర్జ్ పూల్ అప్రోచ్ ఛానల్ కాలువలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. గూడెం దొడ్డి జలాశయంలో 0.57 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. కాలువకు గండి పడిన కారణంగా నీళ్లు వృథాగా తిరిగి పంపింగ్ కేంద్రంలోకి వెళ్తున్నాయి. గేట్ల సాంకేతిక లోపాలను గుర్తించి మరమ్మతులు చేసేదాక నిలువరించటం కష్టమని సాగునీటి శాఖ అధికారులు తెలిపారు.