ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఆదుకోవాలంటూ తెరాస అభిమాని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎరివెల్లి మహేశ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి.. కూలీ పని చేసుకుంటూ డిగ్రీ పూర్తిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని తనవంతుగా ఉద్యమానికి ఊతమిచ్చాడు.
రాష్ట్రం ఏర్పడితే జీవితాలు మారుతాయని ఎన్నో కలలుగన్నాడు. చివరకి అతడికి నిరాశే మిగిలింది. తెరాస ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పొట్టకూటి కోసం ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తల్లిని పోషించుకుంటున్నానని తెలిపాడు. ఇప్పటికైనా తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.