వచ్చే ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుటా మొదట భూపాలపల్లి గడ్డ మీదే ఎగరనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భూపాలపల్లిలో నిర్వహించిన 'ప్రజా గొంతుకకు ప్రణామం' సభ(congress meeting)లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గండ్ర సత్యనారాయణకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సత్యనారాయణతో పాటు ఆయన అనుచరగణాన్ని సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రెండు పర్యాయాలు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. రాష్ట్రానికి చేసిందేమిటని రేవంత్(revanth reddy speech latest) నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. పార్టీని చావు బతుకుల్లో పెట్టి రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. సోనియాగాంధీ లేకపోతే.. ఒంటరిగా సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ సాధ్యమయ్యేదేనా..? అని నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. నరేంద్రమోదీ ఆనాడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
గుండెల మీద తన్ని...
"ఈ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి గెలిపిస్తే.. అందరి గుండెల మీద తన్ని గండ్ర వెంకటరమణారెడ్డి మోసం చేశిండు. తన భార్యకు జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవి రావటం కోసం ఆత్మాభిమానాన్ని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తాకట్టుపెట్టిండు. ఇద్దరు ఉద్దెర వ్యక్తులు.. ఒకరు ఎమ్మెల్యే, ఇంకొకరు జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ అయ్యిండ్రు. ఇసుక ఎక్కడున్నా.. బొగ్గు ఎక్కడున్నా.. భూమి ఎక్కడున్నా.. ఫంక్షన్హాళ్లున్నా.. గండ్ర వెంకటరమణారెడ్డి ఉంటడు. వందేళ్ల నుంచి పేదోళ్లు.. దున్నుకుంటూ జీవనం సాగిస్తుంటే.. వాటి మీద కూడా గండ్ర కన్ను పడింది. ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇదే ఆఖరి ప్రజా జీవితం."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు