ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం నుంచి మొగుళ్లపల్లి వరకు దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు.
అధిక వర్షాల వల్ల జిల్లాలోని రోడ్లు దెబ్బతిని ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా చిట్యాల నుంచి మొగుళ్లపల్లి వరకు రోడ్డు బాగా దెబ్బతిన్నదని.. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు వెంటనే తాత్కాలిక పద్ధతిలో రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి..
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల రానున్న వారం రోజుల పాటు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే అధికారులకు తెలపాలని అన్నారు.
అనంతరం చిట్యాలలో నిర్మాణంలో ఉన్న వైకుంఠదామాలను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆదర్శంగా తీర్చిదిద్దాలి..
అనంతరం ఒడితెల గ్రామంలో పర్యటించి.. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దారని.. మరికొంత సమయం తీసుకొని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పల్లె ప్రకృతి వనంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల ప్రత్యేక అధికారులు శైలజ, సునీత, ఎంపీడీవోలు రామయ్య, ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జీ తహసీల్దార్లు నరేష్, జీవాకర్ రెడ్డి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.