జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎండాకాలం ప్రారంభం కాకముందే బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. గోదావరి నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా.. తీగల వాగు ప్రాజెక్టుకు గండి పడి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు వరి పంటపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. సుమారు 500 ఫీట్లు బోర్లు వేసినా కానీ చుక్కనీరు కానరావడం లేదు.
పంట చేతికందుతుందనుకుంటే..
మరో నెల రోజుల్లో పంట చేతికి అందుతుందనుకున్న సమయంలో బోరుబావులు ఎండిపోతుండడంతో కొన్ని వందల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు.. చేసేదేమీ లేక పొలాల్లో పశువులను మేపుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తీసుకున్న భూమికి కౌలు, పంట పెట్టుబడి తీర్చే మార్గం కానరాక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు.