జయశంకర్ భూపాలపల్లి జిల్లా నీతి అయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే 14వ ర్యాంకు సాధించడం పట్ల జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అభినందించారు. 2020 సంవత్సరం జూన్ మాసానికి గానూ.. నీతి అయోగ్ ప్రకటించిన అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ర్యాంకింగుల్లో జిల్లాలో వైద్య, ఆరోగ్య, పౌష్టికాహార కల్పన, విద్య, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటి వసతుల కల్పన, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాల పెంపుదల, మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధిని సాధించామని కలెక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా గల 115 అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ర్యాంకుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 14వ ర్యాంకు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు.
నీతి అయోగ్ ర్యాంకుల్లో భూపాలపల్లికి 14వ ర్యాంకు! - నీతిఅయోగ్ ర్యాంకింగ్స్
నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేశంలోనే 14వ ర్యాంకు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అభినందించారు. నీతి అయోగ్ సూచనలు పాటిస్తూ.. లాక్డౌన్ సమయంలో మంచి ఫలితాలు సాధించామని, ఇకపై మరింత దృష్టి పెట్టి పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
గత 4 నెలలుగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ.. అత్యంత వెనుకబడిన జిల్లా అయినప్పటికీ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరుపేదల వద్దకు తీసుకెళ్లి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేశామని, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలనే దృఢనిశ్చయంతో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ జిల్లా అభివృద్ధిలో నీతి అయోగ్ సూచనలు పాటించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘనత సాధించడంలో జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తూ.. జిల్లా సంపూర్ణ అభివృద్ధికి అధికారులు అంకితం కావాలని కోరారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు