రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం నిధులను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జయశంకర్, ములుగు, జనగామ, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని సర్కారు బడుల నిర్వహణకు, స్వచ్ఛ కార్మికుల వేతనాలకు తొలిదశ నిధులను విడుదల చేసింది. పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఖాతాల్లో వీటిని జమ చేసింది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు
పాఠశాల నిర్వహణ నిధులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా విడుదల చేస్తారు. 2019-20 విద్యా సంవత్సరానికి బడుల్లో 100 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 100 నుంచి 250 మంది ఉంటే రూ.15 వేలు, 250 నుంచి 1000 వరకు ఉంటే రూ.40 వేలు, వెయ్యికి పైగా విద్యార్థులుంటే రూ.60 వేల చొప్పున నిధులిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా కేటాయిస్తారు. మూడు దశల్లో గ్రాంటు ఇవ్వనున్నారు. ప్రస్తుతం వచ్చినవి మొదటి దశవి. వచ్చే ఎనిమిది నెలల్లో మరో రెండు దశల నిధులు విడుదలవుతాయి.