Jangaon People Stucked in Amarnath : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన జనగామ ప్రాంతానికి చెందిన నలుగురు అక్కడ చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ వద్ద కొండల పైనుంచి భారీ వరదనీరు రావడంతో యాత్రికులకు ఇబ్బందులు కలిగాయి. తమ వారు ఎలా ఉన్నారో అనే ఇక్కడి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
అమర్‌నాథ్‌లో చిక్కుకున్న జనగామ వాసులు.. బిక్కుబిక్కుమంటూ.. - అమర్‌నాథ్‌లో చిక్కుకున్న జనగామ వాసులు
Jangaon People Stucked in Amarnath : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడ చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ వద్ద కొండలపై నుంచి భారీ వరద రావడంతో పదుల సంఖ్యలో యాత్రికులు కొట్టుకుపోయారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ యాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యులు మాత్రం.. తమ వారు ఉన్నారో లేరో.. ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారోనని ఆందోళన చెందుతున్నారు.
ఈనెల 3న జనగామ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తాడూరి రమేశ్, పల్లెర్ల సిద్ధలక్ష్మి, పల్లెర్ల లక్ష్మీనర్సయ్య, గణేశ్‌వాడకు చెందిన జిల్లా సత్యనారాయణ అమర్‌నాథ్ యాత్రకు జనగామ నుంచి వెళ్లారు. అమర్‌నాథ్ కొండల పైకి గుహలో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు శుక్రవారం సాయంత్రం వీరు గుర్రాలపై బయలుదేరారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా కొండల పైనుంచి వరద నీరు రావడంతో వీరంతా టెంట్ల కింద బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. యాత్రలో ఉన్న తాడూరి రమేశ్‌తో ఈటీవీ భారత్ రాత్రి 10.30 గంటలకు మాట్లాడగా, ఆయన క్షేమ సమాచారాలు తెలిపారు.
రమేశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన సోదరుడు జిల్లా సత్యనారాయణతో కలిసి ఒక టెంటు కింద ఉన్నామని చెప్పారు. మరో ఇద్దరు సిద్ధలక్ష్మి, లక్ష్మీనర్సయ్య దంపతులు మాత్రం ముందుగా వెళ్లారని తెలిపారు. అమర్‌నాథ్ కొండల్లో కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ మాత్రమే పని చేస్తోందని, మిగతా ఇద్దరి వద్ద ఆ సిమ్ లేకపోవడంతో వారి సమాచారం తెలియలేదన్నారు. ప్రస్తుతానికి తాము క్షేమంగా ఉన్నామని.. మిగతా ఇద్దరు మరో చోట ఉండొచ్చని చెప్పారు. శనివారం ఉదయం వాతావరణం అనుకూలిస్తే గుహలో దేవుడిని దర్శించుకుంటామని పేర్కొన్నారు.