BRS Athmeeya Sammelanam at Station Ghanpur : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని(BRS Election Campagin) ముమ్మరం చేసింది. ఒకవైపు ఆశీర్వాద సభలతో సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు ఆత్మీయ సమావేశాలతో హరీశ్‌రావు, కేటీఆర్ నియోజకవర్గాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం(BRS Public Meeting)లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. అనంతరం ప్రసంగించారు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా.. స్టేషన్ ఘన్పూర్ గులాబీ కోటకు కంచుకోట అంటూ కొనియాడారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సిద్దిపేట తర్వాత తనకు ఇష్టమైన కార్యకర్తలు స్టేషన్ ఘన్పూర్లోనే ఉన్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని.. రూ.50 కోట్లు పెట్టి ఆయన టీపీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ నేతలే చెప్పారని ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలకు టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారన్నారు. సగం స్థానాల్లో బీజేపీ పార్టీకి నేతలే లేరని.. ఇతర పార్టీ నేతల వైపు చూస్తున్నారని వివరించారు. కేసీఆర్‌పై పోటీ చేస్తా అంటున్న వారిలో కొందరు.. గతంలో వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే గెలవలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని.. కేసీఆర్ అంటేనే ఒక భరోసా అంటూ స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 100 టికెట్లు.. 101 ధర్నాలు అవుతున్నాయి. గాంధీభవన్‌లో చొప్పుకొలేని పరిస్థితి ఉంది. అది ఈరోజు తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. రూ.50 కోట్లను పెట్టి పీసీసీ అధ్యక్షుడి పదవిని కొనుక్కున్నాడు. ఇలాంటి నేతల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిపోతే ఉంటుందా? సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ గెలిచేది లేదు వారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. నల్గొండలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండగల్‌లో ఓడిపోయి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కామారెడ్డిలో పోటీ చేస్తారంటా? మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి.. నా మీద పోటీ చేస్తాడంటా."- హరీశ్‌రావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి