తెలంగాణ

telangana

ETV Bharat / state

అసైన్డ్‌ భూముల్లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు - జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతమో కాదు.. సాక్షాత్తు అక్రమాలకు కళ్లెం వేసి ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన తహసీల్దారు కార్యాలయం చుట్టూ జరుగుతున్న ఉదంతం ఇది. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల విభజనలో భాగంగా ఏర్పడిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రెండో పట్టణంగా దినదినాభివృద్ది చెందుతున్న కాటారంలో ఈ తతంగం నడుస్తోంది.

అసైన్డ్‌ భూముల్లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు

By

Published : Jul 3, 2019, 10:47 AM IST

దందా సాగుతోందిలా...
కాటారం శివారులో సర్వేనెంబర్‌ 128లో 12.21 ఎకరాలు, 139లో 9.09 ఎకరాల సీలింగ్‌ భూమి, 130లో 5.02 ఎకరాలు, 131లో 7.09 ఎకరాలు, 132లో 6.36 ఎకరాల కారజ్‌ ఖాత భూములు ఉన్నాయి. పోతుల్వాయి శివారులోని 161 సర్వే నెంబర్‌లో 1.29, 253 సర్వే నెంబర్‌లో 2.03 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయి. కాటారం మండలం దేవరాంపల్లి నుంచి గంగారం మూలమలుపు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా అసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఇందులో 2.29 ఎకరాల్లో ఆర్‌అండ్‌బీ శాఖ భవనం, 2.10 ఎకరాల్లో పోలీస్‌ స్టేషన్‌, ఎకరం భూమిలో మండల పరిషత్‌, రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టారు. నాలుగేళ్ల క్రితం మిగిలిన భూముల్లో పై సర్వే నంబర్లలో కొందరు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూముల్లో క్రయ విక్రయాలతో పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్థానిక అధికారులను ఆదేశించారు. నాలుగేళ్లుగా నిలిచిపోయిన నిర్మాణాలు ప్రస్తుతం అధికారులు, నాయకుల అండదండలతో ఊపందుకున్నాయి.

సర్వే నంబరు 132 లోని కొంత భూమిని పట్టా చేయగా.. మరికొంత భూమిలో అక్రమాల పర్వం యధేచ్ఛగా కొనసాగుతోంది. భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు. వీటితో పాటు కాటారం ఊర చెరువు శిఖం భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఊర చెరువు శిఖం సర్వే నం 71లో 25.26 ఎకరాలు ఉంది. చెరువు శిఖానికి హద్దులు నిర్ణయించకపోవడంతో భూఅక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

న్యాయ స్థానం ఆదేశాలు బేఖాతర్‌
కాటారంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పంపిణీ చేయాలని వేడుకున్నారు. స్పందించిన న్యాయస్థానం కాటారంలోని పలు సర్వేనెంబర్ల భూములకు స్టేటస్‌కో విధించింది. అయినా కబ్జాదారులు తమ దందా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

రాత్రికి రాత్రే నిర్మాణాలు
కాటారంలోని ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. అధికారుల అండతోనే ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సెలవు దినాలు, రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా పనులు చేపడుతున్నారు. మరి కొందరు తమ స్థలాలకు రక్షణ కవచంలా ప్రహరీలు నిర్మిస్తున్నారు. ఇంకొంతమంది తమ భూములను కాపాడుకునేందుకు పునాదులు తీస్తున్నారు.

ఒకరిపై ఒకరు
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా తమశాఖ పరిధిలోది కాదంటే, తమ పరిధిలోకి రాదంటూ ఆయా శాఖల అధికారులు మిన్నకుండిపోతున్నారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అడ్డుకున్నా నిర్మాణాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఇక రెవెన్యూ అధికారులు సైతం తమ దృష్టికి వచ్చిందని ఒకరు, తమ దృష్టికి రాలేదని మరొకరు అంటుండటం విడ్డూరంగా ఉంది.

నిర్మాణాలను అడ్డుకుంటున్నాం: ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌ఐ, కాటారం
అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన వారిని హెచ్చరించి అడ్డుకుంటున్నాం. కాటారం మండలంలోని అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాను. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నప్పటికీ ఆగడం లేదు. రాత్రి వేళల్లో నిర్మాణాలు చేపడుతున్నారు.

పంచాయతీలదే బాధ్యత: మల్లికార్జున్‌రెడ్డి, ఈవోపీఆర్డీ, కాటారం
మండల పరిధిలోని గారెపల్లి, కాటారం, గంగారం, పోతులవాయి, దేవరాంపల్లి గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అడ్డుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇచ్చాం. సెలవు, రాత్రి వేళల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టే బాధ్యత పంచాయతీలదే.

అడ్డుకున్నా ఆపడం లేదు: షగీర్‌ఖాన్‌, కార్యదర్శి కాటారం
కాటారం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. నిర్మాణాల విషయం తెలిసిన వెంటనే సామగ్రిని స్వాధీనం చేసుకున్నా తిరిగి ఏదో ఓ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా చేపడుతున్నారు.

తాము కాపాడిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: లక్ష్మారెడ్డి, చింతకాని మాజీ సర్పంచి
నేను చింతకాని సర్పంచిగా ఉన్నప్పుడు పోతులవాయి శివారులోని భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకుని కాపాడాం. ప్రస్తుతం అక్కడఇటీవలే అక్రమ నిర్మాణాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు.

ఇదీ చూడండి : పురపాలికల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్​ ప్రణాళిక

ABOUT THE AUTHOR

...view details