Yellampalli Project Compensation Delay : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తైనా ముంపు బాధితులకు పరిహారం జాడ మాత్రం కానరాలేదు. అధికారుల చుట్టూ తిరిగీ, తిరిగి అలసిపోయిన నిర్వాసితులు బతికుండగా పరిహారానికి నోచుకుంటామో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ఊరిడిచి వెళ్లలేక అక్కడే ఉండలేక నానా అవస్థలు పడుతూ ఓ పాఠశాలలో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా శిథిలావస్థకు చేరడంతో 135 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా ఆదుకుంటుందేమోనని ఆశతో నిర్వాసితులు ముందుకు సాగుతున్నారు.
Yellampalli Project Oustees 2024 :జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాంలో ముంపు బాధితులకు 15 ఏళ్లు అయినా పరిహారం మాత్రం అందలేదు. ప్రభుత్వం శాశ్వత పునరావాసం ఏర్పాటు చేయకపోగా సర్వేల పేరుతో అధికారులు కాలయాపన చేయడం మరింత కుంగదీస్తోంది. ఏటా వర్షాకాలంలో వరదలు పెరిగినప్పుడు బడిలో ముంపు బాధితులు తలదాచుకుంటున్నారు.
Yellampalli Project Compensation :2007లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు(Sripada Yellampalli Project) బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాలుగా కోటి లింగాల, మొక్కట్రావ్ పేట్, రాంనూర్, చెగ్యాం, తాళ్ల కొత్తపేట్ గ్రామాలను గుర్తించారు. చెగ్యాంలో కొందరు మినహా మిగతా వారికి పదేళ్ల క్రితమే పరిహారం, పునరావాసం కల్పించారు. పరిహారం అందకుండా పునరావాస కాలనీకి వెళ్లబోమని సుమారు 100మంది పాత గ్రామంలోనే ఉండిపోయారు. ఏటా వరదలు వచ్చినప్పుడు పునరావాస కాలనీలోని బడిలో ఆశ్రయం కల్పించడం, తర్వాత తిరిగి పాత గ్రామానికి వెళ్లటం ఆనవాయితీగా వస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు
"అధికారులు వస్తారు చూస్తారు వెళ్లిపోతారు కానీ మాకు ఎలాంటి సాయం అందించడం లేదు. పరిహారం కోసం ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వమైనా సాయం చేస్తుందని ఆశతో ఉన్నాము. కొంతమందికి మాత్రమే పరిహారం ఇచ్చారు. సర్వేల పేరుతో స్థానిక నేతలు పరిహారం ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడ్డారు. మళ్లీ రీ సర్వే చేయించి పూర్తిస్థాయి పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పించాలి."- బాధిత గ్రామాల ప్రజలు