తమ ఇంటికి ఏ అపాయం రాకుండా నిత్యం అప్రమత్తంగా ఉండే అతివలు కరోనా కష్టకాలంలో తమ కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని కాపాడేందుకు నడుం బిగించారు. క్షేత్రస్థాయి కార్మికుల నుంచి ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు మహమ్మారిపై మూకుమ్మడి పోరాటం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలుచేసే బాధ్యతల్లో ఉన్నారు. జిల్లా నలుమూలల చెక్‌పోస్టుల ఏర్పాటు, 2 వేల వరకు నిబంధనల అతిక్రమణల కేసుల నమోదు, వాహనాల రాకపోకలను నియంత్రించడం, అక్రమ మద్యం, కల్తీకల్లు అమ్మకాల వెలికితీత తదితరాలతో పోలీసులు తమవంతు పాత్రను సమర్థంగా పోషించడంతో జిల్లా అధికారిణి మార్గదర్శనం ఎనలేనిదిగా చెప్పవచ్చు.
టీసెర్ప్ జిల్లా సమాఖ్య ద్వారా 10 వేల మాస్కులను ఉచితంగా తయారుచేసి కలెక్టర్‌కు అందించగా గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా నామమాత్రపు ధరపై 40 వేల వరకు మాస్కులను తయారుచేశారు. మెప్మా ద్వారానూ 15 వేలకుపైగా మాస్కులను తయారుచేసి ఇతర ప్రాంతాలకు పంపారు. జిల్లాలో 187 టీసెర్ప్ కేంద్రాల ద్వారా మహిళలు ధాన్యం సేకరణ చేపట్టగా ఏడు మండలాల్లో మామిడి కాయల కొనుగోలుతో స్వశక్తి సంఘాల అతివలు అడుగులు వేస్తున్నారు. ఉపాధిహామీ పనులతో పాటుగా ప్రస్తుతం రబీలో వ్యవసాయ పనులు, మామిడి కాయలను తెంపటం, ప్యాకింగ్ తదితరాల్లో మహిళలు ముందువరుసలోనే ఉన్నారు.
జిల్లాలో ప్రాంతీయ వైద్యశాల, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య ఉపకేంద్రాలు 171 ఉండగా వీటిల్లోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలను కొనసాగిస్తున్నారు. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి దాదాపుగా 22 వేల మందివరకు జిల్లాకు రాగా గ్రామాలు, పట్టణాల్లో వీరిని గుర్తించేందుకు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటి సర్వే జరిపారు. కోవిడ్ లక్షణాలను గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో వీరు ప్రముఖంగా పాలుపంచుకున్నారు.
జిల్లాలో పనిచేస్తున్న మహిళల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమతమ బాధ్యతల్లో మునిగిపోయారు. కోవిడ్‌వ్యాప్తి నిరోధానికిగాను ఐదు పట్టణాలు, 380 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా చేపట్టిన రసాయన ద్రావణం పిచికారి, ఇతరత్రా పారిశుద్ధ్య పనులను కార్మికులు సమర్థంగా నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకున్న మహిళా అధికారులు, సిబ్బంది ఆసాంతం లాక్‌డౌన్‌లో ప్రజలకు సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నారు.