తెదేపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ నేడు తెరాసలో చేరనున్నారు. తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్ చేతుల మీదుగా రమణ.. తెరాస ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారు. త్వరలో రమణ అనుచరులు కేసీఆర్ సమక్షంలో భారీగా చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
తెరాసలోకి ఎల్. రమణ చేరికపై కొంత కాలంగా చర్చలు జరిగాయి. ఈ నెల 8న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. తెరాసలో చేరిక, పార్టీలో బాధ్యతలు, రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్ర తెదేపా అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు.
ఎల్.రమణకు త్వరలో ఎమ్మెల్సీ పదవితో పాటు భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వంలో క్రియాశీలక అవకాశాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఈటల రాజేందర్ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నేత కోసం చూస్తున్న తెరాస.. ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానించింది.