Revanthreddy on Delhi Liquor Scam: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పట్ల వ్యవహరించినట్లు మద్యం కేసులో కవిత పట్ల ఎందుకు ప్రవర్తించట్లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న జలపతి రెడ్డి కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ సరైన సమాచారం ఇవ్వట్లేదని తెలిపారు. కేసీఆర్ అవినీతికి పాల్పడినట్లు ప్రధాని సహా కేంద్రమంత్రులు వ్యాఖ్యానించారన్న రేవంత్... సీఎంపై ఎందుకు విచారణ చేయట్లేదని విమర్శించారు.
బండి సంజయ్ గతంలో మాదిరి గంగుల కమలాకర్‌పై పోటీ చేయకుంటే బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు గుర్తిస్తారని వెల్లడించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని రేవంత్ ధ్వజమెత్తారు. బండి వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందన్నారు.
'మద్యం కేసులో ఈడీ సరైన సమాచారం ఇవ్వట్లేదు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాతో బీజేపీ ఎలా ప్రవర్తించింది. మద్యం కేసులో కవిత పట్ల అలా ఎందుకు ప్రవర్తించట్లేదు. సీఎం కేసీఆర్ అవినీతిపై నేను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్రమంత్రులు చెప్పారు. మీకున్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటి ? వచ్చే ఎన్నికల్లో బండి, గంగులపై పోటీ చేయాలి. చీకటి ఒప్పందం కోసం బండి వేరే చోట పోటీ చేయాలని చూస్తున్నారు.'-రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు