SIT Officials Investigation TSPSC Paper Leackage In Mallaya: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఓవైపు నిందితులను ప్రశ్నిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ సిట్ అధికారులు విచారణ చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడిన సిట్.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. దాదాపు 40మంది ప్రిలిమ్స్ లో అర్హత సాధించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారి ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
కుటుంబ సభ్యుల వివరాలు, బంధువులు, స్నేహితుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో ఏమైనా స్నేహం, బంధుత్వం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన తాటిపల్లిలోనూ సిట్ అధికారులు విచారణ చేశారు. మల్యాల మండలంలో 100 మందికి 100 మార్కులకు పైగా వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో సిట్ అధికారులు మల్యాల మండలానికి చెందిన గ్రూప్ 1 అభ్యర్థులపై దృష్టి పెట్టారు.
TSPSC Paper Leackage Updates: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న 12మందిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని ఇప్పటికే ప్రశ్నించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన వివరాలను నిందితుల నుంచి సేకరించారు. మంగళవారం నాడు మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఏఈ పరీక్ష రాసిన ప్రశాంత్, రాజేందర్ తో పాటు దళారిగా వ్యవహరించిన తిరుపతయ్యను ప్రశ్నిస్తున్నారు. నీలేష్, గోపాల్ నాయక్, ప్రశాంత్, రాజేందర్ మాత్రమే ఏఈ పరీక్ష రాసిన వారిలో ఉన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో పరీక్ష రాసిన షమీమ్, రమేష్, సురేష్ లను అరెస్ట్ చేశారు. మరో అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి న్యూజీలాండ్‌లో ఉన్నాడు. సిట్ అధికారులు ఇప్పటికే అతనికి మెయిల్ ద్వారా నోటీసులు పంపడంతో పాటు.. లుక్ ఔట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.