భర్త మరణాన్ని తట్టుకోలేక ఆరు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాలలో చోటుచేసుకుంది. కోరేండ్లపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్‌కు... సౌజన్యకు 9 నెలల క్రితం వివాహం జరిగింది. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో... తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న వార్త మరింత సంతోషాన్ని నింపింది. భార్య గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి వెంకటేశ్ తన భార్యను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు.
భర్త మరణం... తట్టుకోలేక కడుపులో బిడ్డతో సహా భార్య బలవన్మరణం - women suicided after 9 months of marriege
మూడు ముళ్ళు... ఏడడుగులతో ఏర్పడిన అనుబంధానికి తొమ్మిది నెలలకే తెరపడింది. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చే తరుణంలో ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మరో మూడు నెల్లలో పుట్టబోయే బిడ్డ కోసం కలలు గన్న ఆ తల్లికి భర్త మరణం గుండెలో గునపాన్ని దింపింది. ఆ గాయాన్ని తట్టుకోలేని భార్య... కడుపులోని బిడ్డతో సహా తనువు చాలించింది.
వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో... వారి జీవితాలను చిన్నాభిన్నం చేద్దామని కాలం కంకణం కట్టుకుందేమో... ఈ నెల 9న చెరువు నుంచి మట్టి తరలిస్తుండగా బుద్దేశ్‌పల్లె వద్ద ట్రాక్టర్ బోల్తా పడి వెంకటేశ్‌ను బలితీసుకుంది. ఎన్నో ఆశలతో... మరెన్నో ఊహలతో ఉన్న సౌజన్యకు భర్త మరణ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. గుండెలవిసేలా ఏడ్చింది. మరో మూడు నెలలైతే... తనకు పుట్టే బిడ్డతో ఆడుకోవాల్సిన భర్త ఈ లోకంలోనే లేకుండా పోయాడన్న వాస్తవాన్ని దిగమింగుకోలేకపోయింది. ఆరు నెల్లలో తమ బిడ్డ గురించి కన్న కలలు.. చెప్పుకున్న ముచ్చట్లు... తనను ప్రతీ క్షణం వెంటాడాయి.
ఎంత మంది ఓదార్చినా... ధైర్యం చెప్పినా... తన జీవితంలోని వెలితిని ఎవరూ పూడ్చలేరనుకుందో ఏమో... కడుపులోని బిడ్డతో సహా తనువు చాలించింది. తనతల్లి గారి ఇంట్లోని వంట గదిలో దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక తన కూతురు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్తయ్య పోలీసులకు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.