Kabali producer KP Chaudhary arrested in drug case :ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన కృష్ట ప్రసాద్ చౌదరి బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సినిమాల పట్ల ఆసక్తితో 2016లో ఉద్యోగం వదిలేసి చిత్రసీమ వైపు వచ్చాడు. అదే సమయంలో కబాలి సినిమా తమిళ నిర్మాత పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య స్నేహంతో తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా కేపీ చౌదరి వ్యవహరించాడు. తరువాత రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నష్టపోయాడు.
Kabali Producer arrested for Drugs Supply :2021లో కేపీ చౌదరి గోవాకు మకాం మార్చాడు. అక్కడ సముద్రతీర ప్రాంతంలో ఓఎమ్హెచ్ క్లబ్ ను ప్రారంభించాడు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనకున్న పరిచయాలతో నటీనటులకుఖరీదైన పార్టీలు ఇచ్చేవాడు. సినీ గ్లామర్‌తో క్లబ్ సజావుగానే సాగినా ఊహించని షాక్ ఎదురైంది. ఓఎమ్హెచ్ హోటల్ నిర్మాణం అక్రమ కట్టడమంటూ గోవా మున్సిపల్ సిబ్బంది దాన్ని కూల్చివేశారు. దాంతో చౌదరి భారీగా నష్టపోయాడు. భర్తీ చేసుకునేందుకు గోవాలో మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాలతో చేతులు కలిపినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియన్ల ద్వారా ఖరీదైన కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ బ్లాట్స్ కొనుగోలు చేసి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు సరఫరా చేస్తూ ఆర్ధికంగా కుదురుకునే పనిలో పడ్డట్టు వెల్లడించారు.
"కేపీ చౌదరి ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 90 గ్రాముల కొకైన్ దొరికింది. పూర్తిగా విచారించిన తర్వాత ఎవరెవరితో ఇతనికి లింక్స్ ఉన్నాయి. ఎవరెవరికి విక్రయించాడు, అమ్మడానికి తెచ్చాడా? సొంతంగా వినియోగించుకోవడానికా? అనే విషయాలు తెలుస్తాయి. పూర్తిగా విచారణ చేసి ఎవరెవరు కస్టమర్లుగా ఉన్నారనేది సీక్రెట్‌గా తెలుసుకుంటాం. నిజ నిర్దారణ అయిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం." - జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ