తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటరు జాబితా సిద్ధం...మొదలైన ఎన్నికల వేడి

పురపాలిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిమగ్నమయ్యారు.ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పురపాలికల్లో ఈ నెల 5 వరకు వార్డుల పునర్విభజనపై ముసాయిదా ప్రచురణ, 6న అభ్యంతరాల స్వీకరణ ఉంటాయి. ఈ నెల 14 వరకు వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ వెల్లడిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

By

Published : Jul 3, 2019, 3:28 PM IST

ఓటరు జాబితా సిద్ధం...మొదలైన ఎన్నికల వేడి

జిల్లా వ్యాప్తంగా ఐదు పురపాలికల్లో 1,98,538 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 1,01,233, పురుషులు 97,305 ఉన్నారు. బీసీ ఓటర్లు 1,58,081, ఎస్సీలు 16,539, ఎస్టీలు 2056 ఓటర్లున్నారు. ప్రథమశ్రేణి పురపాలక సంఘం జగిత్యాలలో 80,193 మంది ఓటర్లున్నారు. పురుషులు 39,595, మహిళలు 40,586 ఉన్నట్లు గుర్తించారు. ద్వితీయశ్రేణి పురపాలక సంఘం కోరుట్లలో 53,885 మంది ఓటర్లుండగా ఇందులో 26,343 పురుషులు, 27,542 మహిళలున్నారు. తృతీయశ్రేణి బల్దియా మెట్‌పల్లిలో మొత్తం ఓటర్లు 40,451 ఉండగా పురుషులు 19,810, మహిళలు 32,186 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ధర్మపురి పురపాలికలో 12,344 మంది ఓటర్లుండగా 6,022 పురుషులు, 6,322 మహిళా ఓటర్లున్నారు. మరో నూతన పురపాలిక రాయికల్‌లో మొత్తం 11,665 ఓటర్లున్నారు. ఇందులో 4,345 పురుషులు, 4,790 మహిళలున్నారు. అన్ని పట్టణాల్లోనూ మహిళా ఓటర్లే పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ సారి పురపోరులో మహిళా ఓటర్ల తీర్పు కీలకం కానుంది.

ముగిసిన పాలన
జిల్లాలోని మూడు పాత పురపాలికల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో వీటితోపాటు మరో రెండు నూతన పురపాలికలకు ప్రత్యేక అధికారులను నియమించారు. పాలకవర్గాలు సోమవారం చివరి సమావేశాలు నిర్వహించగా మంగళవారం వీడ్కోలు కార్యక్రమాలు చేపట్టారు. తాము ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, నిధుల ఆదాయ వ్యయాలను సమావేశాల ద్వారా వివరించారు.

జిల్లాలో సందడి
జులై చివరాంతంలోనే పుర ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఆశావహుల సందడి మొదలైంది. అన్ని పురపాలికల్లోనూ వార్డుల సంఖ్య పెంచడంతో ఈసారి ఆశావహులు కూడా పెరిగారు. ఇంటి నంబర్ల ఆధారంగా వార్డుల విభజన ఖరారు కావడంతో ఆశావహులు రిజర్వేషన్లపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటి నుంచే అన్ని పురపాలికల్లోనూ పోటీలోకి దిగేవారంతా సామాజిక వర్గాలు, ఓటర్లను కలిసి సహకరించాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ నెల 14న రిజర్వేషన్లను సైతం ప్రకటించనుండటంతో తాము లేదంటే జీవిత భాగస్వామిని పోటీకి నిలపాలనే ఆలోచనతో ఉన్నారు. పుర అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్షంగా ఉంటాయని భావిస్తుండటంతో కౌన్సిలర్లుగా రంగంలోకి దిగేవారంతా పార్టీ టికెట్ల కోసం అన్ని పార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వార్డుల పెంపుతోపాటు ఆశావహులు అధికంగా ఉండటంతో అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం అన్ని పార్టీలకు ప్రహసనంగా మారనుంది.

ఇదీ చూడండి : కాడిమోస్తూ వ్యవసాయం..దంపతుల గోస..

ABOUT THE AUTHOR

...view details