Farmer Protest With Flexi: ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దంటే నీళ్లు అందుబాటులో ఉన్నా పంట వేయలేదంటూ జగిత్యాల జిల్లాలో ఓ రైతు తన వ్యవసాయ భూమి వద్ద ఫెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి తాము వరి పంట వేయకపోగా.. ఇప్పుడు ప్రతి గింజ కొంటానని చెప్పడం రైతులతో రాజకీయం చేయడమేనని పేర్కొన్నాడు. మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన సుద్దు సురేందర్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.
వరి వేస్తే కొనలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వల్లనే తనకున్న ఎనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని వదిలేశానని పేర్కొన్నాడు. వరి వేస్తే కొనమని ప్రభుత్వం చెప్పడం వల్లే భూమిని పడావుగా వదిలేశానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్వగ్రామం రాఘవపేటలో ఈ ఫ్లెక్సీ వెలియడం చర్చనీయాంశంగా మారింది. పంటలు వేసే సమయంలో వరి పంట వేయవద్దంటూ రైతులను ఆగం చేసి ఇప్పుడు ప్రతి గింజ కొంటానంటున్న సీఎం.. పంట వేయని రైతులకు పరిహారం గురించి ఆలోచన చేయాలని రైతు సురేందర్ కోరారు.