కరోనా ఎఫెక్ట్: కిచకిచల బదులు ఆకలికేకలు!
కరోనా కోతులకు కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌కు ముందు ఆలయాలు, పర్యాటక ప్రాంతాల వద్ద దొరికే పండ్లు, పుట్నాలతో అవి కడుపు నింపుకొన్నాయి. కొవిడ్ భయంతో ఆలయాలకు వచ్చే భక్తులు తగ్గిపోగా, పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. తిండిపెట్టేవారు లేక కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి గుడి లాక్‌డౌన్‌కు ముందు వేలాది భక్తులతో కళకళలాడేది. వేలాది కోతులున్నా దండిగా ఆహారం దొరికేది. ఆలయానికిప్పుడు అంతగా భక్తులు రాక.. వానరాలు ఆకలితో అల్లాడుతున్నాయి. యాదాద్రి ఆలయం వద్దా అదే పరిస్థితి. కొన్ని స్వచ్ఛందసంస్థలు అప్పుడప్పుడు ఆహారం అందిస్తున్నా ఆకలిదప్పులు తీర్చుకోడానికి కోతులు సైదాపురం, వంగపల్లి గ్రామాలకు, రాయిగిరి చెరువు వద్దకు వెళ్లివస్తున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల ఆంజనేయస్వామి ఆలయం దగ్గరా వానరాలకు తిప్పలు తప్పటం లేదు. నల్లమల అడవుల్లో పండ్లచెట్లు లేక అక్కడి మర్కటాలు భక్తులు వేసే ఆహారం కోసం శ్రీశైలం రహదారిపైకి వస్తుంటాయి. కరోనాతో భక్తుల సంఖ్య భారీగా తగ్గడంతో అవి ఆకలితో అలమటిస్తున్నాయి.భద్రాద్రి జిల్లా సారపాక సమీపంలోని మణుగూరు అడ్డరోడ్డు వద్ద కోతులు వందల్లో ఉంటాయి. వాటి ఆకలిని చూసి భద్రాచలానికి వచ్చే లారీల సిబ్బంది వాహనాల్లో పడిపోయిన పప్పులు, పల్లీలను వేసిపోతున్నారు.