మేకిన్ ఇండియా పోయి ఊరూరా చైనా బజార్‌లొచ్చాయ్.. మోదీపై కేసీఆర్ సెటైర్స్ CM KCR Speech in Jagtial: గోదావరి నది తెలంగాణలోనే మొదట ప్రవేశిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల పరిధి మోతె వద్ద తెరాస బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్... సమైక్య ఏపీలో తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిపేవారు కాదన్నారు. తెలంగాణ సాధించి గోదావరి పుష్కరాలు జరుపుతామని ధర్మపురిలో మొక్కుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
యాదాద్రి లెక్క త్వరలో కొండగట్టు ఆలయం అభివృద్ధి:తెలంగాణ సాధించుకున్నాక గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయని వివరించారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. యాదాద్రి తరహాలో వంద కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా ప్రకటించారు.
''కొండగట్టు అంజన్న ఆలయానికి 384 ఎకరాలు ఇచ్చాం. కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటిస్తున్నా. యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తాం. ప్రఖ్యాత స్తపతులను తీసుకువచ్చి కొండగట్టును అభివృద్ధి చేస్తాం. వరద కాలువ మీద ఇప్పటికీ 13వేల మోటార్లు ఉన్నాయి. వరద కాలువను అద్భుతమైన జలధారగా మార్చుకున్నాం. నేడు రైతులను కరెంట్ బిల్లు అడిగే వాళ్లు ఉన్నారా? ఇప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది.'' - సీఎం కేసీఆర్
మనచుట్టూ గోల్‌మాల్ గోవిందంగాళ్లు చేరారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. మోదీ ఇన్నేళ్ల పాలనలో ఒక్క మంచిపనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. నినాదాలు, మాటలు తప్పా 8 ఏళ్లల్లో మోదీ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. మేకిన్ ఇండియా అని ఏ రంగాన్నైనా మోదీ ప్రోత్సహించారా? అని మండిపడ్డారు. టపాసులు, దీపం వత్తులు, చివరికి భారతీయ జెండాలు కూడా చైనా నుంచి వస్తున్నాయన్నారు. మోదీ దేశ సంపదను కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మోదీ పార్టీకి నిధులిచ్చే వ్యాపారుల చేతిలో విద్యుత్ రంగాన్ని పెడుతున్నారని విమర్శించారు. వ్యాపారులు బాగుపడి రైతులు భిక్షమెత్తుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. 10 వేల పరిశ్రమలు మూతపడి 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. మేకిన్ ఇండియా బజార్‌లు పోయి ఊరూరా చైనా బజార్‌లు వస్తున్నాయన్నారు. మేకిన్ ఇండియా అనే.. మోదీ ఏ రంగాన్ని ఆదుకున్నారని సీఎం మండిపడ్డారు.
''మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఇవాళ విద్యుత్ సరిపడా లేదు. దేశ రాజధాని దిల్లీలో విపరీతమైన కరెంట్ కోతలు. అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం మళ్లీ నష్టపోయే పరిస్థితి. చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయిన చరిత్ర మనది. ఇప్పుడు మరోసారి జాగ్రత్త పడకుంటే తీవ్రంగా నష్టపోతాం.'' - సీఎం కేసీఆర్
ఇవీ చదవండి: