జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బీసీ సంక్షేమ పాఠశాల వార్డెన్ మోరే భద్రయ్య నిన్నటి వరకూ విద్యార్థుల బాగోగులు, చదువులతో తీరికలేకుండా గడిపారు. వేసవి సెలవుల రీత్యా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవడం వల్ల పాఠశాల బోసిపోయింది. స్వతహాగా పకృతి ప్రేమికుడైన భద్రయ్య పక్షుల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వసతిగృహం పరిసరాల్లో చిన్న చిన్న తొట్టెలు ఏర్పాటు చేసి అందులో నీరుపోసి పక్షుల దాహార్తి తీరుస్తున్నాడు. నీటితో పాటు పప్పుదినుసులు, బియ్యం వేస్తూ ఆకలి తీరుస్తున్నారు.
పిల్లలను భాగస్వాములను చేస్తూ..
ప్రకృతే ఆయన ఊపిరి... పక్షుల రక్షణే అతని ధ్యాస - పశువుల కోసం చలివేంద్రం
వేసవి తాపంతో సకల ప్రాణులు అల్లాడిపోతున్నాయి. గుక్కెడు నీటికోసం నలు దిక్కులూ తిరుగుతున్నా నీటి జాడ దొరకడం లేదు. భానుడి ప్రతాపానికి పక్షుల మనుగడ దినదిన గండంగా మారుతోంది. దప్పికతో అల్లాడిపోతున్న తరుణంలో నేనున్నానంటూ వాటి దాహార్తిని తీరుస్తూ... ఆహారాన్ని అందిస్తున్నాడు ఓ వ్యక్తి. పకృతిపై ప్రేమతో మొక్కలు నాటుతూ... హరిత స్ఫూర్తిని చాటుతూ... పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు జగిత్యాల జిల్లాలోని ఓ బీసీ హాస్టల్ వార్డెన్.
పిల్లలతో మొక్కలు నాటించడం, వాటికి నిత్యం నీరు పోయించడం చేశారు. పిల్లలంతా వాటిని బాధ్యతగా పెంచారు. వసతి గృహం చుట్టూ ఎటుచూసినా పచ్చని పకృతి వనంలా కనివిందు చేస్తోంది. సెలవుల్లో ఇంటికి వెళ్లడానికి కూడా కొందరు పిల్లలు ఇష్టపడడం లేదంటే ఇక్కడి వాతావరణం వారిని ఎంతలా ఆకట్టుకుందో అవగతమౌతోంది.
పశువుల కోసం చలివేంద్రం
వసతి గృహం బయట పశువుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. కుండీలను పెట్టి మూడు పూటలా నీరందిస్తున్నారు. దారిన వెళ్లే పశువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఈయన చేస్తున్న సేవలకు స్థానికుల నుంచి ఆదరణ లభిస్తోంది.
సాధారణ రోజుల్లో పిల్లల కేరింతలతో సందడిగా ఉండే ఈ ప్రాంగణం ఇప్పుడు పక్షుల కిలకిల రావాలతో, పచ్చని చెట్లతో శోభాయమానంగా మారింది. తన అభిరుచితో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్న భద్రయ్య చేస్తున్న పని అభినందనీయం.