జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన హర్షిత డిగ్రీ చదువుతోంది. కరోనా ప్రభావం వల్ల కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే సమయాన్ని వృథా చేయకుండా రాఖీల తయారీపై దృష్టిసారించింది. చీరలకు, బ్లౌజులకు వినియోగించే వివిధ రకాల వస్తువులతో అందమైన రాఖీలను తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
చీరలు, బ్లౌజులకు వాడే వస్తువులతో అందమైన రాఖీలు.. ఎలా అంటే..!
కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. తమకు నచ్చిన పనిని.. ఇష్టంగా చేసుకుంటూ ఇతరుల మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి కోవలోకే వస్తుంది జగిత్యాల జిల్లాకు చెందిన హర్షిత. అసలు విషయం ఏంటంటే..?
ఉలన్దారం, సిల్కు దారం, కెమికల్ పూసలు, లేసులు, కుందన్లు తదితర వస్తువులను ఉపయోగించి.. రకరకాల డిజైన్లలో రాఖీలను తయారు చేస్తోంది హర్షిత. ఒక్కో రాఖీ తయారీకి రూ.25 వరకు ఖర్చవుతుందని.. వీటిని బయట కొనాలంటే రూ.50 వరకు వెచ్చించాల్సి వస్తుందని తెలిపింది. కొవిడ్ కారణంగా ఇంటి వద్ద ఉంటూ.. ఇలా వివిధ రకాల డిజైన్లలో రాఖీలు తయారుచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. హర్షిత తయారు చేస్తోన్న ఈ రాఖీలను చూసిన చుట్టుపక్కల వారు.. ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
ఇదీచూడండి: 'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు.. పేదింటి ఆడబిడ్డలకు భరోసా'
TAGGED:
జగిత్యాల జిల్లా తాజా వార్తలు