Complaint on KF Beers issue in Collectorate: మార్చి రాకముందే ఎండలు భగభగ మనిపిస్తున్నాయి. నడి నెత్తిన ఎండ చుర్రుమనిపిస్తున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు కుర్రకారుకు బీర్లు గుర్తుకొస్తాయి. ఎండాకాలంలో బీరు తాగితే శరీరానికి చలవ చేస్తుందన్న నమ్మకంతో బాటిళ్ల కొద్దీ బీర్లు లాగించేస్తుంటారు. ఈ వ్యక్తి అదే ఆలోచించాడో లేక ఇంకేమైనా అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫిర్యాదు చేశాడో తెలియదు. కానీ ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏం ఫిర్యాదు చేశాడనుకుంటున్నారా..
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఏవరైనా ప్రజా సమస్యలు లేదా వ్యక్తిగత కుటుంబ సమస్యలను కలెక్టర్కు విన్నపించుకోవడం చూస్తుంటాం.. కానీ ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ వింత ఫిర్యాదు వచ్చింది. సమస్యలపై కాకుండా తమకు నచ్చిన కింగ్‌ఫిషర్ బీరు దొరకడం లేదని జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే యువకుడు జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతోంది.