అకాల వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ప్రధాన రహదారుల్లో వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఈదురు గాలుల ధాటికి సుమారు 50 వృక్షాలు నేలకూలాయి.
ఈదురు గాలులతో వర్షం కురుస్తున్న సమయంతో జూపార్క్‌లో ఉన్న సందర్శకులను సిబ్బంది బ్యాటరీ వాహనాల ద్వారా బయటకు తీసుకువచ్చారు. జూపార్కులో వర్షానికి చెట్టు కిందకు చేరుకున్న సందర్శకులపై వృక్షం పడి మనికొండకు చెందిన నిఖాతా ఫాతిమా అనే 60ఏళ్ల మహిళ మృతి చెందింది. మరో 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించింది.