YSRCP Leaders sand Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకపై విపక్షాల ఎంత మొత్తుకున్నా, అక్రమ దందా కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఓ మండల స్థాయి నేత తన ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఎస్‌ఈబీ అధికారులపై ఒంటికాలుపై లేచాడు. తనను అడ్డుకునేది ఎవరంటూ మండిపడ్డారు. ‘ఇక్కడ నన్ను ఆపితే.. మా ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీని ఆపినట్లే.. కేపీ సంగతి తేలుస్తాం. అవసరమైతే జగన్ ఇంటిముందు ధర్నా చేయగలం..’ అంటూ వైఎస్సార్సీపీ నందిగామ మండల కన్వీనర్ శివనాగేశ్వరరావు అరుపులు, కేకలతో మండిపడ్డారు.
‘పార్టీ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశాను.. 15 ఎకరాలు అమ్ముకున్నాను.. అక్కడ కడపలో వైఎస్ జగన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ నేను రాజీనామా చేశాను.. అలాంటిది నన్నే ఇసుక తోలనీయకుండా అడ్డుకుంటారా.. వాడెవడు కేపీ.. రేపు టీడీపీ పార్టీలోకి వెళ్లేవాడు.. అసలు సీఎంను అనాలి. ఇసుక కాంట్రాక్టు కేపీకి ఇచ్చి తప్పు చేశారు.. ఎస్‌ఐగారు.. ఏమంటారు.. ఇసుక తోలమంటారా.. లేదా.. ఇంకో పది ట్రాక్టర్లు తోలతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. అసలు ఈ రీచ్.. జేపీకి ఉందా.. ఉంటే చెప్పమనండి..’
ఇసుక కాంట్రాక్టు సంస్థను, ఓ ప్రజాప్రతినిధిని ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను కేపీ, జేపీ మనుషులు అడ్డుకున్నందుకు శుక్రవారం అర్ధరాత్రి నందిగామ మండలం అంబారుపేట వద్ద జరిగిన గొడవ ఇది. మునేరు నదిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఇసుక కాంట్రాక్టు సంస్థ జేపీ తరపున కొంతమంది (కేపీ నియమించిన మనుషులు) అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నందిగామ నాయకులు గ్రామ సచివాలయం పేరుతో తరలిస్తున్నారు.
తమకు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లు తోలుకోమని చెప్పారని, కేపీ ఎవరని, జేపీ ఏమిటని ఎదురు ప్రశ్నించారు. ఘర్షణ తీవ్ర స్థాయిలో జరగడంతో విషయం పోలీసులు, ఎస్‌ఈబీ అధికారుల దృష్టికి వెళ్లింది. అక్కడికి వచ్చిన పోలీసులు, సెబ్ అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనిపై నందిగామ పోలీసు స్టేషన్‌లో జేపీ ప్రతినిధులు, ఎస్‌ఈబీ అధికారులు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రివరకు కేసు నమోదు కాలేదు. మరోవైపు తోలకానికి పంచాయతీ కార్యదర్శి లేఖ ఇచ్చినట్లు చూపిస్తున్నారు. ఈ పంచాయతీ తాడేపల్లి పెద్దలకు చేరుకుంది. కేపీ పార్టీ మారతారని, ఆయనకు ఇసుక కాంట్రాక్టు ఇవ్వడం సీఎం జగన్ చేసిన తప్పిదమంటూ చేసిన వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.