YS Sharmila sensational comments : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడంపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు.
రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా. మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నం. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతు ఆవేదన యాత్రకి అనుమతి లేదంటున్నారు. నిబంధనల ప్రకారం పోతామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదు. రైతుబంధుకు, పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే నిబంధనలు తీసుకొస్తున్నారు. భాజపా, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. ఇష్యూని డైవర్ట్ చేసేందుకు భాజపానీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు.