వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. షర్మిలను పరామర్శించేందుకు వెళ్లేందుకు విజయమ్మ ప్రయత్నించగా... ఆమెను గృహనిర్బంధం చేశారు. పీఎస్‌కు వెళ్లకుండా విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధ కలిగించే అంశమని వెల్లడించారు.
నా కుమార్తెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నా కుమార్తెను చూసేందుకు వెళ్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. ఇంటికే తీసుకువస్తానని పోలీసులు చెబుతున్నారు. ఇంటికి తీసుకువచ్చే వరకు ఇంటి గేటు వద్దే కూర్చుంటా.. నా కుమార్తె ఎక్కడా పరుష పదజాలం వాడలేదు. విమర్శిస్తే సమాధానం చెప్పాలి తప్పితే దాడులు చేస్తారా?. రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చెయ్యలేరు. ఆడబిడ్డపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకులు స్పందిస్తారు.. అందులో భాగంగానే బండి సంజయ్ స్పందించారు. నా కుమార్తెకు అండగా ఉంటా... - వైఎస్ విజయమ్మ
ఇదీ జరిగింది...వరంగల్ జిల్లా పాదయాత్రలో తెరాస శ్రేణులు ధ్వంసం చేసిన వాహనాలతో ప్రగతి భవన్‌కు బయల్దేరిన ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. షర్మిలను కారులోంచి దించే ప్రయత్నం చేయగా...కారు అద్దాలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు. మరోవైపు వైతెపా కార్యకర్తల ఆందోళనతో రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించటంతో కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసులు టోయింగ్ వాహనం తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అధికారుల విధులకు భంగం కలిగించారని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టించారనే అభియోగాలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలపై ఐపీసీ 353, 333, 327 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిలను ఎస్.ఆర్. పోలీస్ స్టేషన్‌కు తరలించినా కారులోనే కూర్చుని షర్మిల నిరసన వ్యక్తం చేయగా...కారులోంచి బలవంతంగా దించి స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న భవనం ఎక్కి వైతెపా కార్యకర్తల ఆందోళన చేయగా... నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న వైతేపా కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు.వై.ఎస్ షర్మిలను పరామర్శించేందుకు ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన విజయమ్మ పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఇవీ చూడండి:
పిరికిపంద చర్యలకు బెదిరేది కాదు కేసీఆర్.. వైఎస్ఆర్ బిడ్డ : షర్మిల
వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చిన హైకోర్టు