తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ సోకినా వెనక్కు తగ్గని నవతరం వైద్యులు

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కొవిడ్‌ విజృంభిస్తోన్న సంక్లిష్ట తరుణంలో దీన్నొక సవాల్‌గా స్వీకరించి పోరులో ముందుండి సేవలందిస్తున్నారు యువ వైద్యులు! ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందించే చికిత్సల్లో యువతరం వైద్యులది కీలక పాత్ర. మార్గనిర్దేశం చేసేది అనుభవజ్ఞులే అయినా.. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగికి అతి సమీపంలోకి వెళ్లి పరీక్షించేది, చికిత్స అందించేది మాత్రం అత్యధిక సందర్భాల్లో యువతరమే.

కొవిడ్‌ సోకినా వెనక్కు తగ్గని నవతరం వైద్యులు
కొవిడ్‌ సోకినా వెనక్కు తగ్గని నవతరం వైద్యులు

By

Published : Jul 29, 2020, 7:14 AM IST

కరోనా చికిత్సలో తెలుగు రాష్ట్రాల్లో ముందుండి సేవలందిస్తున్నారు యువ వైద్యులు. ప్రవేశం మొదలుకొని చికిత్స పూర్తయ్యే వరకూ అన్ని స్థాయుల్లోనూ వీరిదే కీలక పాత్ర. తామూ పాజిటివ్‌గా మారుతున్నా.. తమ సహచరులు ఒక్కొరొక్కరుగా వైరస్‌ బారినపడుతున్నా.. చెక్కుచెదరని గుండెనిబ్బరంతో కరోనాపై సమరంలో ముందడుగే వేస్తామంటున్నారు. అయిన వారికి దూరంగా వసతిగృహాల్లో గడపాల్సి వచ్చినా.. సొంతింట్లో పక్కనే కుటుంబ సభ్యులు కనబడుతున్నా.. పేగుబంధం రా.. రామ్మని ఆర్ధ్రతగా పిలుస్తున్నా.. అన్నింటినీ వదులుకొని కొవిడ్‌ బాధితుల చికిత్సల్లోనే నిమగ్నమయ్యారు యువ వైద్యులు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో.. జనరల్‌ మెడిసిన్‌, పల్మనాలజీ, అనిస్థిషియా వైద్యులు మాత్రమే ఈ విధుల్లో పాల్గొనేవారు. రానురాను కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం.. ఒకదశలో గాంధీ ఆసుపత్రిలో దాదాపు 2వేల మంది బాధితులు చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొనడం వల్ల అన్ని స్పెషాలిటీ విభాగాల వైద్యులను కొవిడ్‌ విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించారు. ఇందులో క్లినికల్‌ విభాగాలతో పాటు నాన్‌ క్లినికల్‌ విభాగాల వైద్యులూ ఉన్నారు.

చికిత్సకు సంబంధించిన మార్గనిర్దేశంలో చేయడంలో ఆయా విభాగాల ఆచార్యులు, సహ ఆచార్యులు కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆ మార్గదర్శకాలను అమలు చేయడంలో ప్రధాన పాత్ర నిర్వర్తిస్తున్నది మాత్రం సహాయ ఆచార్యులు, పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్‌ సర్జన్లే. పీజీ వైద్య విద్యార్థుల్లోనూ రెండో, మూడో సంవత్సరం విద్యార్థులకైతే కొంత అనుభవం ఉంటుంది. కానీ కొవిడ్‌ సేవల్లో పాలుపంచుకోవడానికి తొలి సంవత్సరం విద్యార్థులు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం విశేషమే. ఇందులోనూ నాన్‌ క్లినికల్‌ విభాగాల విద్యార్థులు కూడా.. దీన్నొక సవాల్‌గా స్వీకరిస్తామంటూ.. ఎటువంటి బెరుకు లేకుండా కరోనా బాధితుల చికిత్సల్లో పాల్గొంటుండడం స్ఫూర్తినిచ్చేది.

డాక్టర్‌ అలేఖ్య. గాంధీ ఆస్పత్రిలో సహాయ ఆచార్యులు. ఏప్రిల్‌ 1 నుంచి కొవిడ్‌ సేవల్లో ఉన్న యువ వైద్యురాలు. గాంధీలో సేవలందించి, ఇంటికి వచ్చిన తర్వాత ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ఒకే ఇంట్లో ఉన్నా దాదాపు నాలుగు నెలలుగా కనీసం కన్న కొడుకును కూడా దగ్గరకు తీసుకోలేని పరిస్థితి! అయినా తానెన్నడూ విధులను విస్మరించలేదు.

ఉస్మానియా ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు చికిత్స చేయరు. కానీ ముందు దశలో లక్షణాలతో వచ్చినవారిని చేర్చుకొని నమూనాలు తీసి పరీక్షలకు పంపిస్తారు. పాజిటివ్‌గా వస్తే గాంధీకి తరలిస్తారు. ఈలోగా చికిత్స అందించే క్రమంలో అక్కడ పనిచేస్తున్న వైద్యులకూ వైరస్‌ సోకుతోంది. అలా ఇప్పటి వరకూ జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో దాదాపు 15 మందికి పైగా వైద్యులు కొవిడ్‌ బారినపడ్డారు. అందులో ఒకరే మనీషా. జనరల్‌ మెడిసిన్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థిని. కరోనా అనుమానితులకు చికిత్స అందించే క్రమంలో తనకూ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. చికిత్స అనంతరం కోలుకొని తిరిగి విధుల్లోకి హాజరవుతున్నారు మనీషా.

ఆత్మవిశ్వాసంతో సేవలు

విద్యార్థుల చొరవ వల్ల వైద్యుల కొరతను కొంతవరకు అధిగœమించే అవకాశమేర్పడుతోంది. వైద్య విద్యార్థులు ప్రతిరోజు కనీసం 8 గంటలు విధుల్లో ఉంటున్నారు. కొందరు 12 గంటలపాటు కొనసాగుతున్నారు. వైరస్‌ బాధితుడి వద్దకు వెళ్లేందుకు కుటుంబీకులు కూడా జంకుతున్న పరిస్థితుల్లో వీరు ఆత్మవిశ్వాసంతో సేవలనందిస్తున్నారు. జనరల్‌ మెడిసిన్‌, పల్మనాలజీ విభాగాలవారు మరింత కీలకంగా వ్యవహరిస్తున్నారు. దంత వైద్య విద్యార్థులు అనుమానిత లక్షణాలున్న వారి నమూనాలను సేకరిస్తున్నారు.హౌస్‌సర్జన్లు, పీజీ విద్యార్థుల సాయంతో రోగులకు సకాలంలో చికిత్సలను అందిస్తున్నామని విజయవాడ జీజీహెచ్‌ జనరల్‌ సర్జన్‌ ప్రొఫెసర్‌ శివశంకర్‌ తెలిపారు.

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల సమాచారాన్ని తొలుత స్వీకరించే ప్రదేశమది. రెండు నెలల కిందట నాలుగేళ్ల పాపను తీసుకొచ్చారొకతను. ఆ పాప తల్లిదండ్రులిద్దరికీ పాజిటివ్‌గా రావడం వల్ల గాంధీలో చికిత్స పొందుతున్నారనీ, ఇప్పుడీ పాపకు కూడా వైరస్‌ సోకిందని చెప్పి అతను వెళ్లిపోయాడు. మరింత సమాచారం కావాలని కోరుతున్నా తను పట్టించుకోకుండా అక్కడ్నించి నిమిషాల్లో మాయమయ్యాడు. ఆ పాప ఒకటే ఏడుపు. వదిలి వెళ్లినతను వాళ్ల బాబాయని చెప్పింది. అమ్మానాన్నల గురించి అడిగితే.. ఏడుస్తూనే పేర్లు చెప్పింది. వాళ్లమ్మ ఆసుపత్రిలో ఏ వార్డులో చికిత్స పొందుతున్నారో తెలుసుకొని, అక్కడ పనిచేస్తున్న ఓ యువ వైద్యురాలు స్వయంగా తనే తీసుకెళ్లి వాళ్లమ్మకు అప్పగించారు.

కోలుకుంటే సంతృప్తినిస్తుంది

"కొవిడ్‌ చికిత్సల్లో తొలి రోజుల్లో రాత్రి పగలు తేడా లేకుండా సేవలందించాం. ఇప్పుడు కాస్త సమయం తగ్గింది. ఎంత కష్టపడ్డా.. క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినవారు కోలుకొని ఇంటికెళ్తుంటే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. మా సహచరుడి నాన్నకు కూడా కొవిడ్‌ వస్తే ఇక్కడే చికిత్స అందించాం. అలాగే ఒక ఎస్సై ఆక్సిజన్‌ అందక ఆయాసపడుతుంటే.. సకాలంలో వైద్యంతో గాంధీలో కోలుకున్నారు. ఇలా ఒకరని కాదు.. వేలల్లో కోలుకొని వెళ్తున్నారు".

-డాక్టర్‌ కె.వినయ్‌, జనరల్‌ మెడిసిన్‌, ఆఖరి సంవత్సరం వైద్యవిద్యార్థి (గాంధీ)

అవగాహనకు ఇదో సదావకాశం

"రాష్ట్ర స్థాయి కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ పనిచేసే అవకాశం రావడంవల్ల వివిధ అంశాలపై అవగాహనకు వచ్చేందుకు వీలు ఏర్పడింది. ముఖ్యంగా క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందే రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏకకాలంలో రకరకాల అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారి గురించి, అవసరమైన చికిత్స, ఇతర అంశాల గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో మాకెంతో ఉపయోగంగా ఉంటుంది. ఆస్పత్రుల పరిపాలన నిర్వహణలో వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాలు, ఇతరత్రా అంశాలపై అవగాహనకు వచ్చేందుకు కూడా వీలు ఏర్పడింది"

- డాక్టర్‌ టి.గురువిజయ్‌కుమార్‌, పీజీ వైద్య విద్యార్థి, విజయవాడ

ఇంట్లో వద్దన్నారు.. అయినా చేరిపోయా

"గాంధీలో పీజీలో చేరాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ సమయంలో గాంధీలో చేరడం, అక్కడ కొవిడ్‌ చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు అవసరమా? అని నిరుత్సాహపర్చారు. కానీ నాకు మాత్రం గాంధీలోనే చేరాలని బలంగా ఉంది. అందుకే ఎవరు వద్దన్నా ఇక్కడే చేరాను. వైద్యవృత్తిలో క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించడం సాధారణమే. ఇప్పుడు కొవిడ్‌ ఉందని వెనక్కి తగ్గడం సరికాదు. మా కుటుంబ సభ్యులు కూడా మొదట్లో వద్దన్నారు. కానీ కచ్చితంగా వెళ్తాననడంతో కాదనలేదు. త్వరలో నాకు కొవిడ్‌ వార్డుల్లో పోస్టింగ్‌ ఇస్తారు. చేరడానికి సన్నద్ధమయ్యా".

-రమ్యశ్రీ, ఫిజియాలజీ, మొదటి సంవత్సరం, గాంధీ వైద్యకళాశాల.

మా కుటుంబం మద్దతుగా నిలిచింది

"మావారు ఫార్మాకాలేజీలో పరిశోధన చేస్తున్నారు. ఒక బాబు. మా అత్తామామలు కూడా వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారే. కొవిడ్‌ సేవల్లో పాల్గొనడం వల్ల ముప్పు పొంచి ఉంటుందని తెలుసు. అయినా నాకు మావాళ్లు పూర్తిగా మద్దతుగా నిలిచారు. మా అపార్ట్‌మెంటు వారు కూడా సహకరిస్తున్నారు. దీంతో బాధితులకు సేవలందించడంలో ఇబ్బందేమీ లేదు. ఇది నాకు సంతృప్తిగా ఉంటోంది"

-మౌనిక, 3వ సంవత్సరం పీజీ వైద్యవిద్యార్థి.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details