తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. అధిష్ఠానంలో ఈ అంశం చర్చకు రావడం.. ఆ తర్వాత ఉన్నఫలంగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. అధ్యక్ష పదవిపై ఏఐసీసీ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మారింది.
అధ్యక్ష పీఠం కోసం ఆశావాహులు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రధానంగా ఇద్దరు ఎంపీల మధ్యే పోటాపోటీ నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవడం వల్ల ఆయనకే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
మరోవైపు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి ఇటీవల బెంగళూరు వెళ్లి.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రావడం వల్ల అధ్యక్ష పీఠం రేవంత్‌రెడ్డికి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.
మరోసారి అధిష్ఠానానికి లేఖ..
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఎంపికను వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్లు.. విధేయుల ఫోరం తరఫున అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.