మధుర ఫలానికి పురుగు పోటు తగిలింది. మే నెలాఖరు నుంచి కురుస్తున్న వానలతో పంట దెబ్బతింది. బయట బాగానే ఉన్నా.. పండు అయ్యే సరికి లోపల తెల్లని నూలు పురుగులు ఉంటున్నాయి. తోటలో నేలపాలు.. మార్కెట్లలో చెత్తకుప్పల పాలవుతున్నాయి.
మధుర ఫలానికి పురుగు పోటు
By
Published : Jun 18, 2021, 11:55 AM IST
ఈ ఏడాది పంట కాలం నెల ఆలస్యంగా మొదలైంది. ముఖ్యంగా బంగినపల్లి మామిడి కాయలు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయిలో చేతికందాలి. కానీ ఈ ఏడాది మే నెల 20 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు రైతుకు నష్టం.. తినే వారికి కష్టంగా మారింది.
చెత్తకుప్పలపాలు .. గడ్డి అన్నారం హోల్‌సేల్ మార్కెట్లో ఎటు చూసినా మామిడి రాసులే. పాడైన పండ్లు, చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. టన్నులకొద్దీ కాయలు, పండ్లు మార్కెట్ ఆవరణలోని చెత్తకుప్పల్లో కనిపిస్తున్నాయి. మంగళవారం మొత్తం 910 టన్నుల మామిడి కాయలు మార్కెట్‌కు వచ్చాయి. టన్ను కాయలకు గరిష్ఠ ధర రూ.25 వేలు కాగా.. ఎక్కువగా రూ.11 వేలకే అమ్ముడయ్యాయి. మార్కెట్‌కు వచ్చిన వాటిలో 150 టన్నుల వరకు చెత్తకుప్పల పాలయ్యాయి. మంగళవారం ధర పలకలేదు. కొని మగ్గపెట్టినా అన్నీ ఉపయోగపడుతాయా.. అనే అనుమానంలో వ్యాపారులుంటే.. టన్నులకొద్దీ పంటను ఎలా అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పండుఈగతోనే మామిడికి దెబ్బ
ఎండలు బాగా ఉన్నంత వరకే మామిడి పండ్లను తినగలం. వర్షాలు పడితే పంట దెబ్బతింటుంది. వర్షాలకు తోటలో గడ్డి ఏపుగా పెరిగి.. అందులో పెరిగిన పండుఈగ (దోమ కాటు మాదిరి) కాయలను కుట్టడంతో.. పురుగు పడుతుంది. ఎన్‌రైప్‌తో మగ్గపెడుతుండడం వల్ల కొంత వరకు పురుగు పోటు నుంచి బయటపడగలుగుతున్నాం. వర్షానికి తడిసిన కాయలు పండ్లు అయ్యేలోపు మొత్తం పురుగుపట్టి పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ ఏడాది వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో కాయలను సకాలంలో దించలేకపోయాం.
రూ. 8 లక్షలు నష్టపోయా
సీజన్ ఆరంభంలో లాక్‌డౌన్ ఉండడంతో ఉత్తరభారతానికి మామిడి పండ్లను పంపలేకపోయాం. అప్పుడు ధరలు పడిపోయాయి. తర్వాత విస్తారంగా వర్షాలు పడడంతో పంట దెబ్బతింది. గత ఏడాది టన్ను బంగినపల్లి మామిడి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఉండగా.. ఈ ఏడాది రూ.18 వేల నుంచి రూ. 20 వేలలోపే అమ్ముకోవాల్సి వచ్చింది. వర్షాలు పడితే పండ్లను రక్షించుకోలేని పరిస్థితి. గతంలో ఎప్పుడైనా ఈదురుగాలులతో ఒకట్రెండు వర్షాలు పడేవి. ఈసారి 11 రోజులపాటు ముసురు పట్టినట్టు వర్షం కురియడంతో చెట్లపైనే కాయలు తడిచిపోయాయి. వంద టన్నుల దిగుబడి వస్తుందనుకుంటే.. 20 టన్నుల వరకు తోటలోనే రాలిపోయి పాడయ్యాయి. 15 ఎకరాల తోటను కొని రూ. 8 లక్షలు నష్టపోయా.