కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్‌లాక్-4 మార్గదర్శకాలను సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్-యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన జీవో 120లోని ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యా శాఖ ఈనెల 20 వరకు వర్క్‌ఫ్రం హోం, 21 నుంచి 50% సిబ్బంది మాత్రమే పాఠశాలలకు హాజరు కావాలని పేర్కొంటూ మెమో నెంబర్ 3552 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. గురుకుల విద్యా సంస్థల్లో మాత్రం ఆ ఉత్తర్వులు అమలు చేయటం లేదని ఆరోపించారు. ఫలితంగా సంబంధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి తెలిపారు.
'గురుకుల విద్యాసంస్థల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలి'
గురుకుల విద్యాసంస్థల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురుకుల ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడుతున్న నేపథ్యంలో అన్‌లాక్-4 మార్గదర్శకాలను అమలుచేయాలని కోరింది.
ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ.. గ్రామీణ అభ్యసనా కేంద్రాలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు విద్యనందించేందుకు గురుకుల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సొసైటీ ఆదేశాల మేరకు ఆగస్టు 29 నుంచి పాఠశాలలకు హాజరవుతున్నారని, ఈ క్రమంలో పలువురు కొవిడ్ బారినపడుతున్నారని వివరించారు. పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారికి కనీసం ప్రత్యేక సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులు, కొత్తగా సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు అర్హత గల సెలవులు లేకపోవడం వల్ల వేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఒక్కో యాజమాన్యం ఒక్కో రకంగా ఆదేశాలు ఇవ్వటం సమంజసం కాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:-17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్