Women Thieves Robberies Increase In Hyderabad : పాపం మహిళలే కదా అని లైట్‌గా తీసుకున్నారో.. ఇక మీ సొత్తు మొత్తం గోవిందా. ఎందుకంటే ప్రయాణికుల ముసుగులో వారు.. ఎంతో సులభంగా ఆభరణాలు, సెల్‌ఫోన్‌లను కొట్టేస్తున్నారు. నగరంలో ఈ మధ్య కాలంలో మహిళలు చేసే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు అంటే.. వారిని పట్టుకోవడం ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఒక ప్రయాణికురాలి చేతిలో ఉన్న సంచి నుంచి.. అతి సులువుగా బంగారు ఆభరణాలను కొట్టేశారు. ఆమె ఆ సమయంలో లిఫ్ట్ కోసం సామాన్లతో అక్కడ నిలబడ్డారు. బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడింది ఒక మహిళగా గుర్తించారు. అలాగే జూన్ నెలలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయల్దేరిన దంపతులను దోచుకున్న ముఠాలోనూ మధ్య వయసు ఉన్న మహిళలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
Women Thieves In Hyderabad : ప్రస్తుతం నగరంలో నమోదవుతున్న పలు కేసుల్లో దోపిడీగాళ్లకు మహిళల సహకారం ఉన్నట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి బస్ స్టేషన్లు, ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లు, సాధారాణ రైళ్లు, మార్కెట్లలోని మహిళలే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు తలనొప్పిగా మారిన అంశమేమిటంటే.. ఈ ముఠా సభ్యుల్లో అధికశాతం నిందితుల సమాచారం పోలీసుల రికార్డుల్లో లేకపోవటంతో గుర్తించడం సవాల్‌గా మారిందని పోలీసులు తెలిపారు.
కనిపెట్టలేం.. పసిగట్టలేం :ఈ దొంగతనాల్లో మహిళలే ఎక్కువగా చేస్తుండడంతో వారిని పట్టుకోవడం, కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై ఏళ్ల లక్ష్మితో సహా మరో నలుగురు మహిళలతో ముఠా కట్టి.. రైలు ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు చేస్తారు. వీరు కేవలం పండుగలు, సెలవు రోజుల్లోనే రంగంలోకి దిగుతాయి. మహిళా ప్రయాణికులతో మాటలు కలిపి.. చాలా సులువుగా వస్తువులను కొట్టేసి మరో బోగీలోకి వెళ్లిపోతారు. అలాగే మహారాష్ట్రకు చెందిన రహీమా స్ట్రైలే వేరు.. టిప్‌టాప్‌గా తయారై ప్రయాణికుల మధ్యలో చేరి మెడలోని గొలుసులు, చేతి సంచులు కాజేసి క్షణాల్లో అక్కడ నుంచి మాయమైపోతుంది. మంగళహాట్‌కు చెందిన మరో ముఠా ఆర్టీసీ బస్సులనే లక్ష్యంగా చేసుకొని.. దూర ప్రాంతాలకు టిక్కెట్లు తీసుకుని.. బస్సులో ఉన్న సెల్‌ఫోన్‌లను కొట్టేస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. తమపై దౌర్జన్యం చేయడానికి వచ్చారని నానా హంగామా సృష్టించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు.
Police Unable To Catch Women Thieves : ప్రయాణికుల్లో కలిసిపోయే వారిని పట్టుకోవడం.. పోలీసుల తరం కూడా కావడం లేదంటే వీరి ఎత్తులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీరు ముఖానికి మాస్క్, స్కార్ప్‌లు ధరించి ఉండడం వల్ల సీసీ కెమెరాల్లో చూసిన అంచనాకు రాలేకపోతున్నారు. ఈ మహిళలు కొట్టేసిన వస్తువలను మగవాళ్లకు అందజేసి.. వారు రిసీవర్లకు చేరవేస్తారు. ఆ రకంగా సొమ్ము సంపాదిస్తారు. ఈ నెలలో ప్రారంభమైన ఆషాడం బోనాల్లోనూ భక్తుల రూపంలో చేరిన మహిళలు.. సెల్‌ఫోన్లను కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. రద్దీ ప్రాంతాలు, ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి :