'అతివలంతా ఆత్మసరక్షణ విద్యలో ఆరితేరాలి' - kavacham
మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ విద్యలో ఆరితేరాలని సామాజిక వేత్త యమున అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు శిక్షకుల ద్వారా ఆత్మరక్షణ విద్యలో మెలకువులు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మహిళలపై పెరిగిపోతున్న అరాచకాలను ధీటుగా ఎదుర్కొనేలా అల్వాల్‌లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మిషన్ కవచం పేరుతో ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్పిస్తున్నారు. కార్యక్రమానికి మహాత్మా గాంధీ వ్యక్తిగత సహాయకుడు ఐ. కల్యాణం హాజరయ్యారు. నేటి సమాజంలో మహిళలపై అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని సామాజిక వేత్త యమున అన్నారు. ప్రతి అమ్మాయి మానసికంగానే కాకుండా శారీరకంగా దృఢంగా తయారుచేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అందుకే తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు, అమ్మాయిలకు మార్షల్‌ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇప్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలపై దృష్టి పెట్టామని దాదాపు వారానికి ఐదొందల నుంచి 700 మంది వరకు శిక్షణ పొందుతున్నారన్నారు. విద్యార్థినులతో పాటు బస్తీలు, కాలనీలో మహిళల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.