వి.అంకయ్య.. చెన్నైలో రోజు వారీ కూలీ. ఓ గ్రామానికి సర్పంచ్ అయిపోయాడు. అదీ నామినేషన్ వేయకుండానే.! ఏకగ్రీవమంటే అదీ కాదు..కానీ కూర్చీ ఎక్కేశాడు. ఇదంతా జరిగింది కేవలం.. అతని పేరు మొదటి స్థానంలో ఉండటమే..! 1985లో జరిగిన ఈ పరిణామం... ఏపీ నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ విశేషమే.
ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు...
1985లో అప్పటి వరకు నీలాయపాలెం పొదలకూరు సమితి పరిధిలో చిరమన పంచాయతీ అనుబంధంగా ఉండేది. మండల వ్యవస్థ ఏర్పడటంతో సంగం మండలానికి మారింది. అప్పుడు ఈ గ్రామస్థులు తమకు ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేయాలని నాటి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన ఆమోదంతో ప్రత్యేక పంచాయతీ ఏర్పడింది.
తొలి పేరు ఎవరిదో వారే....
ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. నాడు 350 మంది ఓటర్లున్న ఆ పంచాయతీలో సర్పంచ్ పదవికి ఎవరూ పోటీ పడకుండా.. అప్పటి అధికారులు ఒక ప్రతిపాదన చేశారు. ఓటర్ల జాబితాలో తొలి పేరు ఎవరిదో.. వారినే తొలి పౌరుడిగా ఎంపిక చేస్తామన్నారు.
గ్రామస్థుల అంగీకారంతో దాన్ని అమలు చేయగా... ఆ జాబితాలో తొలిపేరుగా ఉన్న వి.అంకయ్య సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. ఆ సమయానికి అంకయ్య చెన్నైలో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. తాను సర్పంచ్‌గా ఎంపికయ్యానని తెలుసుకుని సంతోషించి.. గ్రామానికి వచ్చి సేవలందించారు. 1987 వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఈ విషయాన్ని ఇప్పటికీ గ్రామంలో విశేషంగా చెప్పుకొంటారు.
ఇదీ చదవండి:వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా పల్లా