ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన శిరోమణి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమె... తండ్రిని చిన్నప్పుడే కోల్పోయింది. అప్పటినుంచి కుటుంబ భారాన్ని మోస్తూ.. లక్ష్యం వైపు సాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న నాటి నుంచి విజయాలతో దూసుకెళ్తోంది. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నిర్వాహకుల అండతో ఓనమాలు నేర్చి.. ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి ఎదిగింది.
2006లో వెయిట్‌లిఫ్టింగ్‌లో శిరోమణి ప్రస్థానం ప్రారంభమైంది. ప్రారంభంలో శిక్షకుడు మారెళ్ల వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయంలో కోచ్ అనపర్తి అమర్నాథ్ వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో 133 పతకాలు, జాతీయ స్థాయిలో 30కిపైగా పతకాలు సాధించింది. 4 అంతర్జాతీయ పోటీల్లో 3 పసిడి పతకాలు సాధించి సత్తా చాటింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తోంది శిరోమణి.