బంగారం అభరణాల విక్రయాల్లో హాల్‌మార్క్ యూనిక్ ఐడీ (హెచ్‌యూఐడీ) అమలును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని పలు జ్యూయలరీ అసోసియేషన్స్ బంద్ నిర్వహించాయి. దేశవ్యాప్త జ్యూయలరీ దుకాణాల ఒక్కరోజు బంద్‌లో భాగంగా.. ఆందోళన చేపట్టాయి. అబిడ్స్‌లోని దుకాణాలను మూసేసి నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన హాల్‌మార్క్ యూనిక్ ఐడీ (హెచ్‌యూఐడీ) వ్యవస్థ అమలు అసాధ్యమని.. ట్విన్ సిటీస్ జ్యూయలరీ అసోసియేన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆరు అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడీ కోసం అస్సెయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్(AHC) వద్ద చాలా సమయం పడుతోందని.. ఫలితంగా నగరు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారన్నారు. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన విధానాలపై నిజామాబాద్ నగరంలోనూ బంగారు దుకాణాల మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. హాల్‌మార్క్ ప్రకారం కొనుగోలుదారుల ప్రయోజనాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కానీ హెచ్‌యూఐడీ నిబంధనల ప్రకారం.. ప్రతి బంగారు దుకాణ వ్యాపారి తప్పకుండా కంప్యూటర్ నిర్వహణ, ప్రతి నగకు స్కానింగ్, అప్‌లోడ్ చేసుకోవడం, విక్రయాల నమోదు చేయడం తదితర వివరాలను నిక్షిప్తం చేసుకోవడానికి అదనపు సమయం, ఆర్థిక భారం ఉంటుందన్నారు. ఈ నిబంధనలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
'హెచ్‌యూఐడీతో వినియోగదారులకు లాభమేంటో అర్థంకావడం లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వం వివరించాలి. నూతన విధానంతో దుకాణదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత విధానం చక్కగా అమలువుతున్నప్పుడు మళ్లీ హెచ్‌యూఐడీ పద్ధతి ఎందుకు. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో వివరించాలి.'
- ప్రవీణ్ కుమార్, ట్విన్ సిటీస్ జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి