Wards Governance in GHMC :దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పురపాలక సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే సందర్భంగా పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అందుబాటులోకి తెచ్చారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు ప్రజా సేవకు అందుబాటులో ఉంటారని చెప్పారు. తద్వారా మెరుగైన ఫలాలు ప్రజలకు అందుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజల వద్దకు పరిపాలన పేరుతో తీసుకొస్తున్న సంస్కరణలకు.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట బీకే గూడాలో సీఎస్ శాంతి కుమారితో కలసి వార్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే వార్డు కార్యాలయాలన్న మంత్రి.. ముఖ్యమంత్రి ముందు చూపుతోనే రాష్ట్రం మరింత దూసుకుపోతుందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు.
Ward Office System in GHMC : అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా, బాధ్యతగా ఉండాలని.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లో వార్డు కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. బస్తీలలో ఎవరి సమస్యలు వారే.. వార్డు కార్యాలయాల ద్వారా పరిష్కరించుకునేలా చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మల్లారెడ్డి వివరించారు.