తెలంగాణ

telangana

ETV Bharat / state

విషమంగానే వైద్య విద్యార్థిని ఆరోగ్యం.. అబద్ధాలు చెబుతున్నారని కుటుంబసభ్యుల ఆరోపణ

KMC Pg Medical Student Health Update: ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీజీ విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నిమ్స్‌లో ఎక్మో సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మంత్రులు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఘటనకు కారణమైన వారిని వదలబోమని స్పష్టంచేశారు. ఐతే... ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేదని... వైద్యులు, మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

By

Published : Feb 24, 2023, 7:55 PM IST

Updated : Feb 25, 2023, 6:41 AM IST

Medical student
Medical student

KMC Pg Medical Student Health Update: వరంగల్​ ఎంజీఎంలో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పీజీ విద్యార్థిని నిమ్స్​లో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ మెడికల్ బులిటెన్ విడుదల చేశారు. వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఏక్మో మీదనే ఉందని.. డయాలసిస్ ప్రక్రియ కొనసాగుతుందని నిమ్స్ సూపరింటెండెంట్ వివరించారు.

ఐతే.. గుండె, కిడ్నీ పనితీరులో కొంత మెరుగుదల కనిపించినట్లు వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్ ద్వారా బాధితురాలు ఆక్సిజన్ తీసుకుంటోందని.. ఎక్మో పెట్టడం వల్ల బీపీ, పల్స్‌లో పురోగతి కనిపించిందన్నారు. ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందన్న నిమ్స్ వైద్యులు... అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్య బృందంతో నిరంతరం పర్యవేక్షిస్తూ... చికిత్స కొనసాగిస్తున్నట్లు మెడికల్ బులిటెన్‌లో వెల్లడించారు.

నిందితులు ఎంతటి వారైనా ప్రభుత్వం ఉపేక్షించదు :నిమ్స్‌కు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్... పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆరోగ్యం విషమంగానే ఉందని... చికిత్స వల్ల కోలుకునే అవకాశాలున్నాయని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ ఘటనను ఎవరూ మత రాజకీయాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లవ్ జిహాదీ అంటూ కొంత మంది లేని తగాదాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని స్పష్టం చేశారు. బాధితురాలికి సైఫ్ వేధింపులు వాస్తవమేనని తేలిందని, అతన్ని శిక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టంచేశారు. ఈ ఘటనపై కమిటీ విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.

మెరుగైన వైద్యం పేరుతో అబద్ధాలు చెబుతున్నారు : బాధితురాలి ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని... వైద్యులు, మంత్రులు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. మెరుగైన వైద్యం పేరుతో అబద్ధాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిజ నిర్దారణ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర గిరిజన శక్తి అధ్యక్షుడు శరత్ నాయక్ ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 25, 2023, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details