ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ఒకటో పట్టణ పరిధిలోని... 21వ డివిజన్ నాగవంశపు వీధిలో భాజపా, వైకాపా వర్గాల ఘర్షణ కేసులో వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. నాగవంశపు వీధిలో జులై 13న రాత్రి ఇరు పార్టీల మధ్య కొట్లాట జరిగింది. నాగవంశపు వీధి నుంచి భాజపా తరఫున కార్పొరేటర్‌గా బరిలో ఉన్న కాళ్ల నారాయణరావు వర్గానికి, వైకాపా వర్గానికి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇరువర్గాల మధ్య జరిగిన కోట్లాటలో నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన భాజపా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలో... జిల్లా ఎస్పీ రాజకుమారిని కలసి ఫిర్యాదు చేశారు.
ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కత్తులు, రాడ్లతో భాజపా అభ్యర్థి నారాయణరావుపై వైకాపా వర్గీయులు దాడిచేసి... హతమార్చేందుకు ప్రయత్నించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్వంలో... వైకాపా వర్గీయులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ రాజకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించి... సాక్షులను విచారించారు. ఆ వీధిలో ఎలాంటి ఉద్రిక్తతకు తావు లేకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు.